Mahaa Daily Exclusive

  పోలవరం – నల్లమల సాగర్‌పై ‘జల’ జగడం.

Share

  • పేరు మార్చిన ఏపీ.
  •  సుప్రీం మెట్లెక్కిన తెలంగాణ!
  •  పోలవరం – నల్లమల సాగర్‌పై ‘జల’ జగడం.
  • ఆ ప్రాజెక్టును తక్షణం ఆపండి.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ.
  •  బనకచర్ల కాదు నల్లమల సాగర్.
  •  ఏపీ కొత్త ఎత్తుగడపై తెలంగాణ సీరియస్.
  • సుప్రీంకోర్టుకు రాష్ట్ర సర్కార్.

హైదరాబాద్, మహా.

తెలుగు రాష్ట్రాల నడుమ మరో పర్యాయం జల వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. గతంలో బనకచర్ల పేరుతో ప్రతిపాదించిన ప్రాజెక్టునే, ఇప్పుడు పేరు మార్చి నల్లమల సాగర్ అంటూ పొరుగు రాష్ట్రం కొత్త నాటకానికి తెరతీసిందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఒకవైపు న్యాయపోరాటానికి సిద్ధమవుతూనే, మరోవైపు కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ రేవంత్ సర్కార్ దూకుడు పెంచింది.

గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘పోలవరం – నల్లమల సాగర్’ అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పొరుగు రాష్ట్రం ఏకపక్షంగా, అనుమతులు లేకుండా చేపడుతున్న ఈ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్ శక్తి శాఖకు ఘాటైన లేఖ రాశారు. అదే సమయంలో, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందంటూ సర్వోన్నత న్యాయస్థానాన్ని (సుప్రీంకోర్టు) ఆశ్రయించింది. గోదావరి జలాల ట్రిబ్యునల్ (1980), ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని తెలంగాణ తన లేఖతో పాటు, కోర్టులో దాఖలు చేసిన అర్జీలో స్పష్టం చేసింది.
వాస్తవానికి గతంలో ఏపీ సర్కారు ‘పోలవరం – బనకచర్ల’ అనుసంధాన ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనపై తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కేంద్రానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో అప్పట్లో ఏపీ వెనక్కి తగ్గింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) టెండర్లను రద్దు చేసుకుంది. కానీ, తాజాగా అదే ప్రాజెక్టుకు ‘పోలవరం – నల్లమల సాగర్’ అని పేరు మార్చి మళ్లీ తెరపైకి తెచ్చిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. పాత ప్రాజెక్టునే కొత్త పేరుతో చేపడుతూ, నివేదికల తయారీకి టెండర్లు కూడా పిలిచిందని, ఇది పొరుగు రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక ఇంకా కేంద్ర జల సంఘం పరిశీలన దశలోనే ఉందని, ఎలాంటి అనుమతులు రాకముందే టెండర్లు పిలవడం చట్టవిరుద్ధమని తెలంగాణ వాదిస్తోంది.
ఈ వ్యవహారంపై న్యాయపోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సర్కారు చేపట్టిన పోలవరం – నల్లమల సాగర్ ద్వారా గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించి, బొల్లాపల్లి వద్ద 400 టీఎంసీల భారీ జలాశయాన్ని నిర్మించాలని చూస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనికోసం దాదాపు రూ. 58 వేల కోట్లతో ప్రణాళికలు రచిస్తోందని, ఇది తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాకు గండి కొట్టడమేనని పేర్కొంది. పోలవరం వెనుక జలాల (బ్యాక్ వాటర్) వల్ల తెలంగాణలో ముంపు సమస్య మరింత తీవ్రమవుతుందని, పర్యావరణపరంగా ఇదొక పెను ముప్పు అని ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతుల కమిటీ గత జూన్‌లోనే ఈ ప్రతిపాదనను వెనక్కి పంపి, అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన విషయాన్ని పిటిషన్‌లో గుర్తు చేసింది.
కేంద్రానికి రాసిన లేఖలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం పోలవరం అంశాన్నే కాకుండా, రాష్ట్రంలోని ఇతర పెండింగ్ ప్రాజెక్టుల అంశాలను ప్రస్తావించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా కట్టడి చేయాలని, అక్కడ జరుగుతున్న భూసేకరణను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులకు అనుమతులు రావాలంటే కృష్ణా ట్రిబ్యునల్-2 తీర్పును త్వరగా ఖరారు చేయాలని, విచారణను వేగవంతం చేయాలని కోరారు. ఏది ఏమైనా, పేరు మార్చి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.

Latest