హైదరాబాద్
“Longing for Justice… Continuous Denial of Bail and Caging Dissent” కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయం ఆలస్యమైతే అది కేవలం ఒక వ్యక్తికే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే తీవ్ర నష్టమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, మానవ హక్కులకు కట్టుబడి ఎల్లప్పుడూ బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
2014లో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, మానవ విలువలను తుంగలో తొక్కుతూ నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై దేశద్రోహి ముద్ర వేయడం వారికి అలవాటుగా మారిందన్నారు.
బీజేపీ పాలనలో రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులు తీవ్రంగా కుదించబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్న “బెయిల్ నిబంధన, జైలు మినహాయింపు” అనే మార్గదర్శకాలను పక్కనపెట్టి, నెలల తరబడి విచారణ లేకుండానే జైలులో ఉంచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, ముఖ్యంగా మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు, బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించే వారు అత్యధికంగా బాధితులవుతున్నారని తెలిపారు. అధికార దుర్వినియోగం వల్ల ఆర్టికల్ 21 హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు హరించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
భావోద్వేగాలను రెచ్చగొడుతూ, ఎన్నికల అక్రమాలతో అధికారంలోకి వస్తున్న బీజేపీ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని, వాటిపై ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. పవిత్రమైన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ, పౌర హక్కుల రక్షణలో ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్ పార్టీ దేశంలో బీజేపీ నియంతృత్వ పోకడలను ఎక్కడికక్కడ ఎండగడుతూ బలహీన వర్గాల పక్షాన నిలుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం సమాజమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. మౌలిక హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రతి ఉద్యమానికి పార్టీ అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, నటుడు ప్రకాష్ రాజ్, ఏపీసీఆర్ జాతీయ కార్యదర్శి నదీమ్ ఖాన్, యాక్టివిస్టులు లలితా రాందాస్, లహరి, అమీర్ అజీజ్, న్యాయవాది రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.








