Mahaa Daily Exclusive

  సంగారెడ్డిలో లక్ష మందితో భారీ సభ….

Share

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ సభ.
* ​రాముడి పేరుతో బీజేపీ విభజన రాజకీయం.
*:​నెహ్రూ, గాంధీల చరిత్ర చెరిపే కుట్ర!
* ​మోదీకి నెహ్రూను విమర్శించే అర్హత లేదు.
* ​ప్రజా సమస్యలు గాలికి.. గాంధీ కుటుంబంపై గురి.
* కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి .

హైదరాబాద్, మహా.

పార్లమెంట్ వేదికగా ప్రజాస్వామ్య విలువలకే ముప్పు వాటిల్లేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్ గాంధీభవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై పార్లమెంట్‌లో చర్చించే సాహసం చేయలేని ప్రధాని మోదీ, కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నెహ్రూ, గాంధీ కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర్యం కోసం ఆస్తులను, ప్రాణాలను దారాదత్తం చేసిన ఘనచరిత్ర నెహ్రూ కుటుంబానిదని, అలాంటి త్యాగధనులను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పన్నెండేళ్ల పాటు కఠినమైన జైలు జీవితం గడిపిన నెహ్రూను, దేశం కోసం ప్రాణాలిచ్చిన వారిని అవమానించడం అంటే భారత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. అసలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టిన మోదీకి, అమిత్ షాకు ఆనాటి ఉద్యమకారుల గురించి, గాంధీ, నెహ్రూల త్యాగాల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు.
ఒకనాడు జాతిపిత మహాత్మా గాంధీ ‘రఘుపతి రాఘవ రాజారాం’ అంటూ రాముడి పేరుతో దేశ ప్రజలందరినీ ఏకం చేసి స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపిస్తే, నేడు బీజేపీ అదే రాముడి పేరును అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విడదీస్తోందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాముడి పేరు చెప్పి మూడుసార్లు అధికారంలోకి వచ్చిన మోదీ, పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్న హామీని మాత్రం పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలపై చర్చ జరగకుండా ఉండేందుకే వ్యూహాత్మకంగా ప్రతిపక్ష నేతలపై, గతించిన మహనీయులపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. మోదీ ఈరోజు ఇంత స్వేచ్ఛగా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారంటే అది గాంధీ కుటుంబం తెచ్చిన స్వాతంత్ర్యం, అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలమేనని, ఆ విషయాన్ని మరిచిపోయి ప్రవర్తించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కేవలం ఒక్కరోజు జైల్లో ఉండాలంటేనే కాళ్లు చేతులు వణికే బీజేపీ నేతలు, ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపిన నెహ్రూను విమర్శించడం సూర్యుడిపై ఉమ్మి వేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచం మొత్తం మహాత్మా గాంధీ ఐడియాలజీని ఆదర్శంగా తీసుకుని నడుస్తుంటే, దేశంలో మాత్రం బీజేపీ, ఆర్ఎస్ఎస్ మూకలు గాంధీ పేరు లేకుండా చేయాలని చూస్తున్నాయని జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరికి డిజిటల్ కరెన్సీలో కూడా గాంధీ బొమ్మ లేకుండా చేయాలనే కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారని, ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. గాంధీ కుటుంబం అంటే బీజేపీకి భయంతో కూడిన అసూయ అని, ప్రజల హృదయాల నుంచి వారిని ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు. నెహ్రూ, గాంధీలపై మోదీ, అమిత్ షాలు చేస్తున్న నిరంతర దాడులను తిప్పికొట్టేందుకు, వారి కుట్రలను ప్రజల్లో ఎండగట్టేందుకు త్వరలోనే సంగారెడ్డి వేదికగా భారీ ఎత్తున నిరసన సభను ఏర్పాటు చేయనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. సుమారు లక్ష మందితో నిర్వహించే ఈ సభ ద్వారా ఢిల్లీ పీఠం కదిలేలా నినదిస్తామని, సభ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.