Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ వైఖరితో రాజ్యాంగం ఖూనీ. …స్పీకర్ తీర్పుపై హరీశ్ రావు నిప్పులు…..

Share

హైదరాబాద్, మహా.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను దిగజార్చుతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న “సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం తెలంగాణలో నేటి తీర్పుతో పూర్తిగా బట్టబయలైందని ఆయన ఎద్దేవా చేశారు.
హరీశ్ రావు తన ప్రకటనలో ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించారు. ఇతర పార్టీల నుండి గెలిచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ చట్టాలను స్పీకర్ కార్యాలయం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. అధికార పక్షానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాశారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఢిల్లీ వేదికగా రాజ్యాంగ నైతికత గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ఈ రాజ్యాంగ ధిక్కరణను ఎందుకు ప్రశ్నించడం లేదని హరీశ్ రావు నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, అధికార దాహంతో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న తీరు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. నేటి ఘటన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చెరగని మచ్చగా మిగిలిపోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హరీశ్ రావు హెచ్చరించారు.