* వరంగల్ పోలీసు శాఖలో కలకలం.
* ఏసీపీ సహా ముగ్గురు అధికారుల సస్పెన్షన్
* తప్పుడు కేసుల నమోదుపై డీజీపీ కఠిన నిర్ణయం.
* ఏసీపీ నందిరాం నాయక్, ఇన్‌స్పెక్టర్ గోపిపై వేటు
* మట్టెవాడ తప్పుడు కేసుల వ్యవహారం..డీజీపీ సంచలన ఉత్తర్వులు
వరంగల్, మహా.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో పనిచేసిన ముగ్గురు అధికారులపై రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేయడం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్, ప్రస్తుతం సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న గోపి మరియు ఎస్‌ఐ విఠల్‌లను సస్పెండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు కేసులు నమోదు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి, ప్రాథమిక ఆధారాలతో కూడిన నివేదికను సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగానే బాధ్యులైన ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ ఉత్తర్వులను వెలువరించారు.
ఈ నిర్ణయంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. గత కొంతకాలంగా వరంగల్ పరిధిలో పనిచేస్తున్న పలువురు అధికారుల తీరుపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కమిషనరేట్‌కు చెందిన కొందరు అధికారులు సస్పెండ్ కాగా, మరికొందరు బదిలీ అయ్యారు. అయితే, ఏకంగా ముగ్గురు అధికారులపై డీజీపీ నేరుగా చర్యలు తీసుకోవడం పోలీసు యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విధి నిర్వహణలో పారదర్శకత లేకపోవడం మరియు అమాయకులపై తప్పుడు కేసులు బనాయించడం వంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందనే సందేశాన్ని ఈ సస్పెన్షన్ ద్వారా డీజీపీ స్పష్టం చేశారు. ఈ ఉదంతం కమిషనరేట్‌లోని ఇతర అధికారుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది.







