కేసీఆర్ను ఎదుర్కోలేకనే అక్రమ కేసులు.
* దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టండి.
* ఓటమి భయంతోనే ఎన్నికల నుంచి కాంగ్రెస్ పరారీ.
* కేసులకు భయపడం.. రైతుల కోసం పోరాటం ఆపం. * బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
హైదరాబాద్, మహా.
అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే కేసీఆర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేకనే ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులను ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని కేటీఆర్ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ గట్టిగా గర్జిస్తుంటే, దాన్ని తట్టుకోలేకనే ప్రభుత్వం తప్పుడు లీకులు ఇస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని మంత్రులకు సాగునీటి రంగంపై కనీస అవగాహన లేదని, కేవలం అబద్ధాలతోనే కాలం వెళ్లదీస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులకు నిజంగా మంచి చేశామని ప్రభుత్వానికి నమ్మకం ఉంటే, నామినేటెడ్ పద్ధతిలో కాకుండా వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను కూడా వాయిదా వేస్తున్నారని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రైతు బంధు, కౌలు రైతులకు ఆర్థిక సాయం, రైతు కూలీలకు భరోసా వంటి హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఇచ్చిన ‘420’ హామీలను అమలు చేయలేక ప్రజలకు ముఖం చూపలేకపోతున్నారని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమైందని, రైతులకు అవకాశం చిక్కితే కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైలుకు పంపినా భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అర్జునుడి లక్ష్యంలాగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, రైతాంగానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ గారిపై నిందలు వేస్తున్నారని, కానీ వాస్తవాలను ఎవరూ దాచలేరని అన్నారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని, ప్రజాక్షేత్రంలోనే అన్ని విషయాలను తేల్చుకుంటామని కేటీఆర్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.








