Mahaa Daily Exclusive

  అత్తగా మారబోతున్న ప్రియాంక గాంధీ: అవివా బేగ్‌తో రైహాన్ వాద్రా నిశ్చితార్థం

Share

  • అత్తగా మారబోతున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
  • కుమారుడు రైహాన్ వాద్రా నిశ్చితార్థం
  • అవివా బేగ్ తో రైహాన్ ఏడేళ్ళ ప్రేమకు లైన్ క్లియర్
  • త్వరలో మోగనున్న పెళ్ళి బాజాలు

ఢిల్లీ, మహా : కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా, తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నారు.

రణతంబోర్‌లో ఘనంగా వేడుక

వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటికే నిరాడంబరంగా జరిగినట్లు తెలుస్తుండగా, బుధవారం రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో మరోసారి వైభవంగా వేడుక నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. రాబోయే కొద్ది నెలల్లోనే వీరి వివాహం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఎవరీ అవివా బేగ్?

ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల అవివా బేగ్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్, ప్రొడ్యూసర్. ఆమె తన కళ ద్వారా దైనందిన జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తారు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మోడర్న్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన అవివా, సోనిపట్‌లోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె ‘అటెలియర్ 11’ అనే ఫోటోగ్రాఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. గత ఐదేళ్లుగా రైహాన్ నిర్వహిస్తున్న ‘యు కాంట్ మిస్ దిస్’ అనే ఆర్ట్ కలెక్టివ్‌లో ఆమె తన కళాఖండాలను ప్రదర్శిస్తున్నారు.

రాజకీయాలకు దూరంగా రైహాన్ వాద్రా

ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడైన రైహాన్ (25), తన కుటుంబ రాజకీయ వారసత్వానికి భిన్నంగా కళా ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. తన తాత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఉన్నట్లే రైహాన్‌కు కూడా ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి ఉన్న ఈ అభిరుచిని కొనసాగించమని తల్లి ప్రియాంక గాంధీ అతడిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారు. విజువల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న రైహాన్.. వన్యప్రాణులు, వీధి చిత్రాలు, కమర్షియల్ ఫోటోగ్రఫీలో నిష్ణాతుడు. 2021లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తన మొదటి సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు. డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో చదువుకున్న రైహాన్, లండన్‌లోని ఎస్ఓఏఎస్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. రాజకీయ వేదికలపై అప్పుడప్పుడు కనిపిస్తున్నప్పటికీ, రైహాన్ ఎక్కువగా వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. ఇప్పుడు తన ఇష్టసఖి అవివాతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Latest