- మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
- కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ
- వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ మహా;
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సాయంత్రం మాంనూరులోని ఖిలా వరంగల్ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సంబంధిత రికార్డులు, వంటగది, స్టోర్ రూమ్, భోజన నిర్వహణ విధానం తో పాటు భోజనం నాణ్యతను సమగ్రంగా పరిశీలించారు.
విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు.
అనంతరం కలెక్టర్ విద్యార్థులతో సన్నిహితంగా ముచ్చటించి, వారి వివిధ సబ్జెక్టుల లోని పఠన సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి, క్రమశిక్షణతో ముందుకు సాగి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ దాతగా అందించిన 40 దుప్పట్లను (బ్లాంకెట్లు) జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సేవాభావాన్ని కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత, వర్ధన్నపేట మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్, డి.సి.ఓ సరిత, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








