- బీజేపీ కొత్త బాస్ గా నితిన్ నబీన్ ఏన్నిక
- నేడు ప్రమాణ స్వీకారం
- హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోడీ
- నడ్డా నుంచి బాధ్యతలు తీసుకోనున్న నితిన్ నబీన్
న్యూఢిల్లీ, మహా : బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయనకు పోటీగా ఎలాంటి నామినేషన్లు రాకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనంగా మారింది. ప్రస్తుతం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నితిన్ నబీన్ మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నితిన్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఇతర అగ్రనేతలు హాజరయ్యారు. నితిన్ నబీన్ ఎన్నికపై అధికారికంగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రకటించారు.
నేపథ్యమిది….
నితిన్ నబిన్ సిన్హా జననం 23 మే 1980 జన్మించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు బంకిపూర్ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. నితిన్ నబిన్ను 2025 డిసెంబర్ 14న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు నియమించింది. నితిన్ నబిన్ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ మరణాంతరం 2006లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006లో జరిగిన ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తరువాత బంకిపూర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. నితిన్ నబిన్ నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నితీష్ కుమార్ మంత్రివర్గంలో 9 ఫిబ్రవరి 2021 నుండి 9 ఆగష్టు 2022 వరకు రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు.







