Mahaa Daily Exclusive

  ట్యాపింగ్ చేసేది పోలీసులే.. నా ఫోన్ ట్యాప్ అవ్వట్లేదా?: సిట్ నోటీసులపై కేటీఆర్ ధ్వజం

Share

  • సిట్ విచారణకు హాజరవుతా
  • పోలీసు అధికారులను ప్రశ్నలు అడుగుతా
  • టీవీ సీరియల్​లా ఫోన్​ ట్యాపింగ్​ విచారణ
  • మాజీ మంత్రి కేటీఆర్

సిరిసిల్ల, మహా : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్‌ విచారణకు కచ్చితంగా హాజరవుతానని, పోలీసు అధికారులను కూడా తాను కొన్ని ప్రశ్నలు అడుగుతానని మాజీమంత్రి కేటీఆర్​ తెలిపారు. తన ఫోన్‌ ట్యాప్‌ అవుతుందా? అని సిట్‌ అధికారులను అడుగుతానని చెప్పారు. తాము ఏ తప్పూ చేయలేదుని, ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఫోన్​ ట్యాపింగ్ కేసులో సిట్​ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ మేరకు సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి సిట్‌ అంటే సిట్‌ స్టాండ్‌ అంటే స్టాండ్‌ అనే పరిస్థితి ఉందని కేటీఆర్​ చెప్పారు. రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకాదని ఏదో రూపంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం స్కామ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం బావమరిది సృజన్​ రెడ్డి బొగ్గు స్కామ్‌ను హరీశ్‌రావు ఉదయం బయటపెడితే, సాయంత్రం సిట్ నోటీసులు వచ్చాయన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి కుమారుడు ప్రైవేటు భూములు కబ్జా చేస్తే మాత్రం దానిపై సిట్‌ ఉండదన్నారు.

అమృత్​ టెండర్లలో సృజన్‌రెడ్డి కంపెనీకి అర్హత లేకపోయినా ప్రభుత్వం కాంట్రాక్టులు దక్కించుకున్నారని, ఈ విషయంలో కేంద్రమంత్రికి ఆధారాలు ఇచ్చామని ఇంతవరకు దానిపై దర్యాప్తు చేయలేదని కేటీఆర్ తెలిపారు. గచ్చిబౌలి భూముల్లో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగినా, రేవంత్ రెడ్డి స్కామ్‌లపై కేంద్రం స్పందించట్లేదని కాపాడుతున్నారని ఆరోపించారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌, బొగ్గు కుంభకోణంపై మాత్రం ఎలాంటి సిట్‌ ఉండదని దుయ్యబట్టారు. రాష్ట్రం ఫిర్యాదు చేస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని కిషన్‌రెడ్డి చెబుతున్నారని ఆక్షేపించారు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే రాష్ట్రం కోరితే చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లు ప్రభుత్వాలు చేయవని, పోలీసు వ్యవస్థ చేస్తుందని కేటీఆర్ అన్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, మాజీ హోం సెక్రటరీ రవిగుప్తా వంటి అధికారులను సిట్​ ఎందుకు ప్రశ్నించట్లేదని ఆక్షేపించారు. కేవలం ప్రతిపక్ష నాయకులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని చెబితే దానిని ప్రభుత్వం ఖండించలేదని, ట్యాప్‌ చేయట్లేదని ప్రమాణం చేసి చెబుతారా? అని ప్రశ్నించారు.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంబంధం లేని నేతలను ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి దావోస్​ నుంచి వచ్చే వరకు తన పదవి ఉప ముఖ్యమంత్రి, నల్గొండ బాంబులు ఎవరూ కూలుస్తారో అనేది ఆయన భయమన్నారు. అందుకే పదిరోజుల పాటు ఈ నోటీసులంటూ డ్రామాలాడుతూ సీఎం శునకానందం పోందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ చేయట్లేదా? అని కేటీఆర్​ ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏమీ లేదనే విషయం విచారణాధికారులకు కూడా తెలుసన్నారు. సిట్‌ విచారణలో అడిగిందే అడుగుతున్నారని, కార్తికదీపం సీరియల్​ సమయం గడుపుతున్నారని చెప్పారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు చేయలేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ క్రీడలో చివరకు బలి పశువులయ్యేది అధికారులేనని కేటీఆర్ అన్నారు. ప్రజల దీవెనతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ సీఎం అవుతారని, ఏ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయో అప్పుడు అన్నీ బయటకు వస్తాయన్నారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్​ చేయట్లేదా? అధికారులు చెప్పాలని ప్రశ్నించారు. ఫోన్​ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును సాక్షిగానే పిలిచారని బాధితుడిగా పిలవలేదన్నారు.