- స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా భారత్.. ఇదే ప్రధాని విజన్
- క్రికెట్ ఆడి సంసద్ ఖేల్ మహోత్సవ్ ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- క్రీడా రంగంలో భారత్ ప్రపంచస్థాయిలో రాణించాలి : కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : ఆటలు కేవలం మెడల్స్ కోసమే కాదని, దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపేందుకు స్పోర్ట్స్ ఒక శక్తిమంతమైన మార్గమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. క్రీడలు ప్రజలకు ఎన్నో నేర్పుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ.. దేశాన్ని స్పోర్ట్స్ పవర్ హౌస్‌గా మార్చాలని విజన్‌గా పెట్టుకున్నారని అన్నారు. గురువారం సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో గవర్నర్ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటలు కేవలం మెడల్స్ కోసమే కాదని.. దేశ ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి చూపేందుకు స్పోర్ట్స్ ఒక శక్తిమంతమైన మార్గమని గవర్నర్ వివరించారు. స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంగా మారిందని, యోగాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రధాని మోదీ పాలసీలను ప్రజా ఉద్యమాలుగా మార్చడంలో ఆయన నాయకత్వ సామర్థ్యం అద్భుతమైనదని జిష్టుదేవ్ వర్మ కొనియాడారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి అన్ని మెడల్స్ వస్తాయని ఊహించలేదని, త్రిపుర నుంచి ఒలింపిక్స్‌కు పోటీ పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ కేంద్ర మంత్రి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు ఇంత స్థాయిలో పాల్గొనడం సంతోషకరమని గవర్నర్ అభివర్ణించారు. క్రీడలు ప్రజలకు ఎన్నో నేర్పుతాయన్నారు. ఇది వికసిత్ భారత్ కోసం వేసే ముందడుగు అని.. ‘స్వస్థ్ భారత్, శ్రేష్ఠ భారత్’కు ఇది తొలి అడుగు అని గవర్నర్ ఉద్ఘాటించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో భారతదేశం క్రీడారంగంలో ప్రపంచస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మన దేశం జనాభా పరంగా, యువత జనాభా పరంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, కొన్ని క్రీడల్లో వెనుకబడి ఉందని, అందుకే ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడారంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. క్రీడాకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, ఓడిపోయిన సందర్భాల్లో కూడా నిరుత్సాహపడవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని సూచిస్తూ, భవిష్యత్తులో గొప్ప విజయాలు సాధించాలని ప్రేరేపిస్తున్నారని గుర్తు చేశారు. ఈ రోజు ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు గణనీయంగా రాణిస్తున్నారని, క్రీడాకారులకు అవసరమైన శిక్షణ, ఫిట్‌నెస్ సదుపాయాల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కామన్‌వెల్త్ గేమ్స్ భారతదేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడారంగంలో భారత్ ముందుండాలనే లక్ష్యంతో, అన్ని వర్గాల ప్రజలను క్రీడల్లో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. .








