Mahaa Daily Exclusive

  కేసీఆర్ కు బిగ్ షాక్..! ఫోన్ ట్యాపంగ్ కేసులో విచారిస్తామని సిట్ నోటీసులు..!

Share

  • కేసీఆర్ కు బిగ్ షాక్
  • ఫోన్ ట్యాపంగ్ కేసులో విచారిస్తామని సిట్ నోటీసులు
  • హైదరాబాద్ పరిధిలోనే విచారిస్తామన్న అధికారులు
  • ఎక్కడకు రమ్మన్నా వస్తామని నోటీసుల్లో వెల్లడి
  • నందినగర్ లోని ఇంట్లో నోటీసులు అందించిన అధికారులు
  • మధ్యాహ్నం గం. 3 కు విచారణ
  • కీలక ప్రశ్నలతో విచారణకు సిద్దమైన సిట్

 

హైదరాబాద్, మహా : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందినగర్ లోని ఆయన నివాసంలో ఈ నోటీసులు అందించారు. ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును విచారించగా… తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది.

 

గురువారం నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. వయసురీత్యా విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని మీరు కోరిన చోటే విచారిస్తామని కేసీఆర్‌కు తెలిపారు. కేసీఆర్‌ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో ఉన్నారు. అయితే ఇవాళ ఉదయం సిట్‌ అధికారులు అక్కడికే వెళ్లి నోటీసులు ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ అక్కడికి వెళ్లకుండా బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.

 

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. గత బీఆర్ఎస్ హయాంలో కొందరు అధికారులు, నేతలు ట్యాంపింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ విచారణ కూడా జరిపిస్తోంది. ఇందుకోసం ఇటీవలనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ కూడా ఏర్పాటు చేసింది. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ టీమ్ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపింది. అవసరమైతే మళ్లీ కూడా పిలుస్తామని ఇటీవలే సీపీ సజ్జనార్ కూడా ప్రకటించారు. ముందుగా హరీశ్ రావుని విచారించిన సిట్ ఆ తర్వాత కేటీఆర్ ను విచారించింది. దాదాపు 7 గంటలకుపైగా ప్రశ్నించింది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుని కూడా సిట్ విచారించింది. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

 

ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ కొంత కీలక సమాచారాన్ని సేకరించారు. సేకరించిన వివరాలు, ప్రస్తుతం జైల్లో ఉన్న పోలీసు అధికారుల నుంచి సేకరించిన వివరాలు ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమ ఫోన్ నిఘా ఆరోపణలతో మొదలైంది.. 2024 మార్చిలో ఈ విషయం వెలుగుచూసింది. అప్పటి ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులు ముఖ్యంగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రతిపక్షనేతలు, వ్యాపారవేత్తలు, పాత్రికేయులు, న్యాయమూర్తులు, సెలబ్రెటీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 600 మందికిపైగా ఫోన్లు ట్యాప్ చేశారని వేలమంది కాల్ డేటా రికార్డులు , ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డులు అక్రమంగా యాక్సెస్ చేశారనే ఆరోపణలున్నాయి. ఇది ముఖ్యంగా ప్రతిపక్షాలను నియంత్రించేందుకు, ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈ కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటైంది. 2025 డిసెంబర్ నుంచి 2026 జనవరి వరకూ సిట్ హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరింత బలపడింది. పలువురు ఎస్ఐబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు

 

ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ వర్గాలు దీన్ని రాజకీయ ప్రతీకారంగా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ నిఘా జరిగిందని, దాన్ని బయటపెట్టాలని చెబుతోంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలు, సిట్ విచారణలో వెలుగుచీసిన వాస్తవాల ఆధారంగానే తాము ముందుకు వెళ్తున్నామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం జరగనున్న విచారణలో కేసీఆర్ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారు? ఏ సమాధానాలు చెబుతారు? ఇదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.