హైదరాబాద్, మహా : ఫోన్ ట్యాపింద్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో జరిగిన భారీ అవకతవకల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఇటువంటి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్‌పై బురద చల్లడం అంటే సూర్యునిపై ఉమ్మి వేయడమేనని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ‘డ్రామా’ ఆడుతోందని హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించి, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని హరీశ్ రావు కొనియాడారు. చరిత్ర సృష్టించిన నాయకుడిని అవమానించేలా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డిని ‘చరిత్రహీనుడు’గా ఆయన అభివర్ణించారు. అధికారం, అహంకారం ఎల్లకాలం ఉండవని, రేవంత్ చిల్లర రాజకీయాలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం మొత్తం ఆయనకు అండగా నిలుస్తుందని, తమకు ఎవరి భయం లేదని తేల్చిచెప్పారు. నోటీసులతో బెదిరించి రాజకీయంగా పైచేయి సాధించాలనుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.








