- ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు తేలాల్సిందే
- కేసీఆర్‌కు సిట్ నోటీసులపై మహేష్ కుమార్ గౌడ్
- కేసీఆర్ అంటే గౌరవం ఉంది
హైదరాబాద్, మహా : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నంది నగర్ లోని తన నివాసంలో సిట్ అధికారులో నోటీసులు ఇచ్చారు. మాజీ సీఎం వయస్సును దృష్టిలో ఉంచుకొని వారు కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం తో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పారదర్శకంగా సాగుతోందని స్పష్టం చేశారు. ఉద్యమ నాయకుడిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉందని, అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ట్యాపింగ్ ఉదంతంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనేది నిగ్గు తేలాల్సి ఉందన్నారు. సుమారు 500 మంది ఫఓన్లు ట్యాప్ చేశారని అంటున్నారు, అంటే ఇందులో ఎవరి కుట్ర ఏమిటి, ఎవరి పాత్ర ఎంత అనేది తేలాలంటే సిట్ దర్యాప్తులో భాగంగా కీలక నేతల నుంచి సమాచారాన్ని కూడా సేకరించాల్సి ఉందన్నారు. అధికారుల ప్రమేయం మాత్రమే కాకుండా, అప్పటి ముఖ్యమంత్రి, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరగవని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దర్యాప్తు ప్రక్రియలో భాగంగా అవసరమైతే ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉందని, కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని మహేష్ గౌడ్ తేల్చి చెప్పారు. ఇది కేవలం చట్టపరమైన ప్రక్రియ అని, బాధ్యులెవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. కెసిఆర్ కి నోటీస్ లు ఇవ్వటం పై రాజకీయ దురుద్దేశం లేదన్నారు. మున్సిపాలిటీ లో మెజారిటీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ లకోసం డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. ఇంచార్జ్ మంత్రులు కి బి ఫార్మ్ విషయం లో పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపారు.








