Mahaa Daily Exclusive

  రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా చర్యలు….

Share

రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా చర్యలు.
* కోర్టులపై సంపూర్ణ విశ్వాసం: ఏవీ రంగనాథ్.
* హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో స్పందన.
* ప్రభుత్వ ఆస్తుల రక్షణే లక్ష్యమని స్పష్టీకరణ

హైదరాబాద్, మహా.

తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే తాను విధులు నిర్వర్తిస్తున్నానని, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు, ప్రజా భూములను పరిరక్షించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్టికల్ 21, ఆర్టికల్ 48ఏ స్ఫూర్తితోనే హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, కోర్టులపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.

సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఏవీ రంగనాథ్, ఇప్పటివరకు సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను రక్షించామని తెలిపారు. ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగా, మరో 20 చెరువుల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చామని వెల్లడించారు.

భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నందునే హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోందని రంగనాథ్ ఆరోపించారు. ల్యాండ్ మాఫియా తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లోతుకుంటలో రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడినట్లు పేర్కొంటూ, అనుమతులు లేకుండా హెరిటేజ్ గుట్టల్లో బ్లాస్టింగ్ జరిపారని విమర్శించారు. సేవ్ ద రాక్స్ సొసైటీ, స్థానిక ప్రజల ఫిర్యాదుల ఆధారంగానే హైడ్రా చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారే తనపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేశారని పేర్కొన్న రంగనాథ్, ప్రస్తుతం తనపై మొత్తం 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని తెలిపారు. వాటన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా వంద శాతం ఫలితాలు సాధించేలా పనిచేస్తానని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, లోతుకుంట ప్రభుత్వ భూముల వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సెక్రటరీ హోదాలో ఉన్న అధికారికి తగదని వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. అర్హత కలిగిన మరో అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని సూచిస్తూ, రంగనాథ్ ఆ పదవిలో కొనసాగితే రూల్ ఆఫ్ లా దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే ఏవీ రంగనాథ్ తన వైఖరిని వివరిస్తూ హైడ్రా చర్యలు పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.