Mahaa Daily Exclusive

  లోక్‌సభలో గందరగోళం నిరసనలు నినాదాలతో హోరెత్తిన సభ…..

Share

  • లోక్‌సభలో గందరగోళం
  • నిరసనలు నినాదాలతో హోరెత్తిన సభ
  • ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్
  • సభ బుధవారానికి వాయిదా

న్యూఢిల్లీ, మహా : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో సభ హోరెత్తింది. సభా మర్యాదలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను ప్రస్తుత సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ చైర్‌లో ఉన్న దిలీప్ సైకియా ప్రకటించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే ఇంకా ప్రచురితం కాని తన ‘మెమోయిర్’ (జ్ఞాపకాల పుస్తకం)లో పేర్కొన్న కొన్ని ముసాయిదా అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. అయితే, దీనికి స్పీకర్ అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తూ కొందరు ఎంపీలు కాగితాలు చింపి చైర్ వైపు విసిరారు. కొంత మంది సభ్యులు స్పీకర్ ముందున్న బల్లపై ఎక్కి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. దీంతో దిలీప్ సైకియా సభను మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సభ మొదలైనప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో చివరకు బుధవారానికి వాయిదా వేశారు. సభ్యుల ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలపడంతో సస్పెన్షన్ ఖరారైంది.

సస్పెండైన ఎంపీల జాబితా

మాణికం ఠాగూర్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ పడోలే, హిబి ఈడెన్, డీన్ కురియకోస్, ఎస్. వెంకటేశన్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా వారింగ్

గాంధీ విగ్రహం వద్ద నిరసన

తమ పార్టీ సభ్యులపై తీసుకున్న చర్యను ఖండిస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, చర్చకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్లతో భయపెట్టాలని చూస్తోందని వారు ఆరోపించారు. ఈ సస్పెన్షన్ల పర్వంతో అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు మరింత ముదిరినట్లయింది. మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలోని అంశాలు జాతీయ భద్రతకు లేదా ప్రభుత్వ విధానాలకు సంబంధించినవి కావడంతో ఈ వివాదం మున్ముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.