హైదరాబాద్, మహా : తల్లిపై ఉన్న ప్రేమ, బాధ్యత ఒకవైపు.. తన వివాహం కావడం లేదనే వేదన మరోవైపు.. ఆ యువతిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాయి. తల్లికున్న వైకల్యం కారణంగా తన వివాహం జరగడం లేదని భావించిన ఓ యువతి మనస్తాపానికి లోనై ప్రాణాలు తీసుకుంది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగిందంటే..
మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి అనే 26 ఏళ్ల యువతి ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. ఆమెకు చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. మరోవైపు మతిస్థిమితం లేని తల్లి సరస్వతి బాధ్యతలు విజయలక్ష్మి చూసుకునేది. వీరు కూకట్‌పల్లి పరిధిలోని మైత్రినగర్‌లో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మికి ఇటీవల పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే, తన తల్లి పరిస్థితినిని వివరించడంతో పాటు, ఎవరూ ఆమెను చూసుకునేవారు లేరని, పెళ్లి తర్వాత కూడా తనతోనే ఉంటుందని పెళ్లి సంబంధాల సమయంలో చెప్పేది. అయితే, ఆమె తల్లి కూడా తమ వద్దే ఉండటానికి ఎవరూ ఒప్పుకోలేదు. దాంతో పెళ్లి సంబంధాలు రద్దు అవుతూ వస్తున్నాయి. తల్లి అనారోగ్యం కారణంగా తనకు పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, తనకు వివాహం కావడం లేదని ఆమె మనోవేదనకు గురైంది. తల్లికి అన్నీ తానై సేవలు చేస్తున్నప్పటికీ, తన భవిష్యత్తు గురించి ఆలోచించి కుంగిపోయింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది, కానీ ఎంతకీ తిరిగి రాలేదు.
విజయలక్ష్మి అదృశ్యంపై ఆమె బంధువు అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం హుసేన్‌సాగర్‌లో ఒక యువతి మృతదేహం తేలిందని లేక్ పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆ మృతదేహం టెకీ విజయలక్ష్మిదేనని నిర్ధారించారు. తల్లి కోసం ఎంతో తపించిన యువతి చివరకు తల్లి అనారోగ్యమే తన పెళ్లికి అడ్డంకిగా మారిందని, తనతో పాటు ఆమె ఉండేందుకు ఎవరూ ఒప్పుకోవడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అందరినీ కలిచివేసింది.








