- తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
- బీఆర్ఎస్ పార్టీలో ఏకగ్రీవం.. కాంగ్రెస్ పార్టీలో చేరిక
- వికారాబాద్ మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి
వికారాబాద్, మహా : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపి మెుత్తం 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2,996 వార్డులు, డివిజన్లకు ఎలక్షన్ జరగనుంది. సగటున ప్రతి వార్డుకు నలుగురు చొప్పున అభ్యర్థుల పోటీ పడుతున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీలుగా చెప్పుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాయి. మరికొన్ని చోట్ల బీజేపీ-బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించేందుకు కలిసి పోటీ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఎలాంటి పొత్తులకైనా.. ఎత్తులకైనా సిద్ధపడుతున్నారు.
వికారాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకగ్రీవమై.. సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పి.విజయకుమార్ సతీమణి విజయలక్ష్మి 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశారు. మంగళవారం నామినేషన్లకు చివరి రోజు కావటంతో పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులచే నామినేషన్లు ఉపసంహరింపజేశారు. దీంతో ఆమె ఏకగ్రీవమయ్యారు. ఆ కొద్దిసేపటికే భార్యాభర్తలు ఇద్దరూ కనిపించకుండా పోయారు. బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేసినా స్పందించలేదు. ఫోన్లు స్విచాఫ్ చేసుకొని పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండాపోయారు. సాయంత్రానికి వారు కాంగ్రెస్ గూటికి చేరినట్లు వచ్చిన సమాచారం అందింది. దీంతో బీఆర్ఎస్ నేతలు నివ్వెరపోయాయి. పార్టీకి నమ్మక ద్రోహం చేశారని వాపోయారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఇది రాజకీయమని, ఇందులో న్యాయం, అన్యాయం అనేది ఉండదని అంటున్నారు. ఇక ఇదే పురపాలిక 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల అనంత్‌రెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఇక్కడ మొత్తం 34 వార్డులుండగా.. మిగతా 32 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.








