విజయవాడ, మహా : డిజిటల్ న్యూస్ మీడియా ఛానళ్లకు అవార్డులు అందజేయడం తెలుగు రాష్ట్రాలలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కార్యక్రమం విజయవాడలోని హోటల్ లీలా గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ జర్నలిస్ట్, సమాచార కమిషన్ మాజీ ఛైర్మన్ పి. విజయబాబు, ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి. అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిజిటల్ మీడియా వేగవంతంగా సమాచారాన్ని అందించడమే కాకుండా ఖచ్చితమైన, నమ్మదగిన కంటెంట్‌ను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఎంతో కీలకమని పేర్కొన్నారు.
వార్తలను నిష్పాక్షికంగా, నిజానిజాలు నిర్ధారించుకున్న తరువాతే ప్రచురించాలని, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టడం అత్యంత అవసరమని తెలిపారు. సమాజంలో అలజడులు సృష్టించే లేదా విద్వేషాలను పెంచే వార్తలను డిజిటల్ మీడియా పూర్తిగా నివారించాలన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభంగా ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా నిలబెట్టే పాత్ర పోషించాలన్నారు.
ఈ కార్యక్రమంలో దూరదర్శన్ మాజీ అధికారి ఎన్.వి. హనుమంతరావు, సోషల్ మీడియా క్లబ్ ఆఫ్ ఏపీ చైర్మన్ సన్ మూర్తి, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తిప్పరాజు రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు, అసోసియేషన్ కన్వీనర్ ఎం.ఆర్. పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ న్యూస్ మీడియా ఆఫ్ ది ఇయర్ – 2026 అవార్డును ధర్మపీఠం విత్ ఏబీఆర్ డిజిటల్ న్యూస్ మీడియా ఛానల్ చైర్మన్ భాస్కర్ రెడ్డికి ప్రదానం చేశారు. ఈ అవార్డు డిజిటల్ మీడియా రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.








