- కీలక కేసుల డాటా సురక్షితం
- జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారం
- ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు చెక్కు చెదరలేదు
- ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టత
హైదరాబాద్, మహా : నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని ఎఫ్ఎస్ఎల్ డైరక్టర్ శిఖా గోయల్ స్పష్టత ఇచ్చారు. 2 కీలక కేసులకు సంబంధించిన డేటా ఉన్న ఫైల్స్, డిస్కులు కాలిపోయాయని జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వివరాలను ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశఁలో తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ లో కాలిపోయిన డాక్యుమెంట్స్ ఇదివరకే ఏసీబీ కోర్టుకు సమర్పించామని, మా వద్ద లేకపోయినా కోర్టు వద్ద ఉంటాయన్నారు. ఏదైనా ఘటనలో ఆధారాలు కాలిపోయినా మా టీమ్ వాటిని డేటా నుంచి రిట్రీవ్ చేస్తుందని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ ఆఫీసులో శనివారం ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. మంటలను మొదట ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి గుర్తించారని, మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యపడలేదని.. అదే సమయంలో మంటలు క్రమంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు వ్యాపించాయని తెలిపారు.
కీలక కేసు ఆధారాలపై దుష్ప్రచారం..
అనాలసిస్ డాక్యుమెంట్ లో కొన్ని ఫైల్స్ దగ్దం కాగా, వాటిని గుర్తించే పనిలో ఉన్నట్లు శిఖా గోయల్ తెలిపారు. ఈ ప్రమాదంలో 2015లో నమోదైన ఓటుకు నోటు కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి, అలాగే కొన్ని కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవలం లేదన్నారు. ఆ వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దని సూచించారు. 2015లో నమోదైన ఏసీబీకి సంబంధించిన ఓటుకు నోటు కేసు మెటీరియల్స్ ధ్వంసం అయినట్లు ప్రచారం జరిగిందన్నారు. అయితే కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021 లో ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశామన్నారు. ఓటుకు నోటు కేసు పూర్తి రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాలిపోయిన ఆధారాలు ఏసీబీ దగ్గర ఉన్నాయని తెలిపారు. కేసుకు సంబంధించిన ఆధారాలలో ఎలాంటి నష్టం జరుగలేదని పేర్కొన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను సైతం ఏసీబీ కోర్టుకు సబ్మిట్ చేశాం. 7 ఆధారాలు మినహా మిగతా వాటిని కోర్టుకు సమర్పించినట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు. ఏదైనా కేసులకు సంబంధించిన ఆధారాలు, పరికరాలను ఎఫ్ఎస్ఎల్ జాగ్రత్తగా ఉంచుతందని, డేటాను టీమ్ రిట్రీవ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ అగ్నిప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పకడ్బందీగా ఉండేచోట కంప్యూటర్ ల్యాబ్‌లోనే మంటలు రావడ, కీలక పత్రాలు ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా కావాలనే సాక్ష్యాలను రూపుమాపడానికి ఈ పని చేశారా అనే కుట్ర కోణంపై పోలీసులు దృష్టి సారించారు. కేసు దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలను తెలుపుతామని శిఖా గోయల్ మీడియాకు చెప్పారు.








