- క్రయవిక్రయాల్లో ‘సాగుభూమి’ వెనుకబాటు
- గత ఏడాది కన్నా రూ.90.19 కోట్లు తక్కువ రాబడి
- రిజిస్ట్రేషన్ల శాఖ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, మహా : రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాల్లో స్తబ్ధత కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో స్థిరాస్తి లావాదేవీలు వెనుకబడినా క్రమేపీ పుంజుకున్నాయి. కానీ, సాగు భూముల రాబడి మాత్రం తగ్గింది. 2025 మార్చి నుంచి ఈ ఏడాది జనవరి మధ్య ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే సాగు భూములు క్రయవిక్రయాల ద్వారా రూ.1,188.17 కోట్ల రాబడి వచ్చింది. ఇదే సమయానికి గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,278.36 కోట్లు వచ్చింది. రూ.90.19 కోట్లు తక్కువగా ఆదాయం నమోదైంది. రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లూ తక్కువే. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.60 లక్షలు రిజిస్ట్రేషన్లు జరగ్గా గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 5.09 లక్షలు. మరో రెండు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నివేదిక విడుదల చేసింది. 2025 మార్చి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తంగా 14.05 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,440.97 కోట్ల రాబడి వచ్చిందని, ఇది గతేడాది కన్నా రూ.876.97 కోట్లు అధికమని వెల్లడించింది.
ఫాం ల్యాండ్స్ కొనుగోళ్లే ఎక్కువ
2025-26లో రెండు త్రైమాసికాల వరకూ స్థిరాస్తి వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. ప్రధానంగా అర్బన్, కోర్ అర్బన్ ప్రాంతాల్లో లేఔట్‌లు, వెంచర్ల నిర్మాణం నెమ్మదించింది. దీంతోపాటు భూ భారతి పోర్టల్‌లో సాగు భూముల విక్రయాలు పెద్దగా పెరగలేదు. ప్రాజెక్టులు, సాగునీటి కాలువల కింద భూ క్రయవిక్రయాలు గతంతో పోల్చితే తగ్గాయి. ప్రస్తుతం భూ భారతి పోర్టల్‌లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లలో ఫాం ల్యాండ్స్ కొనుగోళ్లే ఎక్కువ ఉంటున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రమే కొంత మేర సాగు భూముల లావాదేవీలు మెరుగ్గా ఉన్నాయని ఆ శాఖ నివేదికలో పేర్కొంది.








