కరీంనగర్, మహా : గత రెండు మూడు రోజులుగా కరీంనగర్ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. కారణం మేయర్ పీఠంపై ఎవరు కూర్చుంటారు? అనే విషయంపై సందిగ్ధత ఉండేది. చివరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీనే మేయర్ పీఠంపై కూర్చుంది. నిజానికి కాంగ్రెస్ తీవ్రంగా ఈ స్థానం కోసం ప్రయత్నం చేసింది. కానీ లెక్కలు కుదరలేదు. దీంతో కాషాయ పార్టీకి లైన్ క్లియర్ అయింది.
34 మంది కార్పొరేటర్ల మద్దతుతో కాషాయ జెండా ఎగురవేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బీజేపీ కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, వై.సునీల్ రావులను నిలబెట్టింది. వారే గెలిచినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. నిజానికి మేయర్ పీఠం దక్కించుకునేందుకు బండి సంజయ్ చేసిన వ్యూహాలు ఫలించాయి. ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం హంగ్ సృష్టించింది. బీజేపీ అత్యధికంగా 30 డివిజన్లను గెలుచుకుంది. తరువాత కాంగ్రెస్ (14), బీఆర్ఎస్ (9), ఏఐఎంఐఎం (3),ఏఐఎఫ్ బీ 2, మిగిలిన డివిజన్లలో స్వతంత్రులు గెలిచారు. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా 34 మంది బీజేపీకి, 21 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ తటస్థంగా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. కరీంనగర్ కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్శించాయి. బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందోనని అందరూ అనుకున్నారు. కానీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీకి రూటు క్లియర్ అయింది. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది.








