Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం

Share

  • కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం
  • పటాన్‌చెరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్
  • తిరిగి స్వంత గూటికేనా?

హైదరాబాద్, మహా : పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. ముఖ్యంగా ఇస్నాపూర్‌లో తన ఎక్స్ అఫీషియో ఓటుతో బీఆర్ఎస్ చైర్మన్‌ను గెలిపించుకున్న అనంతరం, తనదైన శైలిలో బుల్లెట్ దిగిందా లేదా? అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ తరపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో 2024 జూలైలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో ఆయనపై ఈడీ దాడులు జరిగాయి. పలు రకాల సమస్యలు రావడంతో ఆయన పార్టీ మారారు. మొదట్లో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగినా చివరికి కాంగ్రెస్ లోనే చేరారు. అయితే కాంగ్రెస్‌లో చేరి తాను పెద్ద తప్పటడుగు వేశానని, ఆ పార్టీ వల్ల తనకు లేదా నియోజకవర్గానికి వెంట్రుక వాసి కూడా ప్రయోజనం కలగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు గుర్తింపునిచ్చింది గులాబీ జెండానేనని ఆయన బహిరంగంగానే ప్రకటించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఆయన ప్రచారం చేశారు. పని చేశారు కానీ.. ఆ పార్టీలో మళ్లీ అధికారికంగా చేరలేదు. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని మొదటి నుంచి స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేతలు కాటా శ్రీనివాస్ గౌడ్ , నీలం మధు ముదిరాజ్ వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని రగడ చేయడం వంటి ఘటనలు ఆయనపై ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేశాయి. ఈ వర్గపోరు కారణంగానే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఇమడలేక తిరిగి బీఆర్ఎస్ బాట పట్టారు.

మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ స్వాగతిస్తుందా?

మహిపాల్ రెడ్డి సోదరుడు ఇప్పటికే బీఆర్ఎస్‌లో చేరడం, స్వయంగా ఎమ్మెల్యేనే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించాలని పిలుపునివ్వడం వంటి పరిణామాలు ఆయన పునరాగమనాన్ని సూచిస్తున్నాయి. అయితే, మున్సిపాలిటీల్లో పార్టీని గెలిపించినప్పటికీ, ఆయనను మళ్లీ అధికారికంగా చేర్చుకునే విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పార్టీ కేడర్ సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. ప్రస్తుతం పటాన్ చెరు నియోజకవర్గానికి ఆదర్శ్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు. ఇటీవలి కాలంలో ఆయనే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ మహిపాల్ రెడ్డిని చేర్చుకుంటే ఆయన అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది.

Latest