కారేపల్లి:💥💥రూ.12 లక్షలు కాజేశారు★అక్రమార్కులను కాపాడే ప్రయత్నంలో అధికారులు?
డ్వాక్రా రుణాల్లోని అక్రమం బట్టబయలు…
*లేని వ్యక్తుల పేరుతో గ్రూపులను సృష్టించిన అక్రమార్కులు
*వినాయక్,స్వరాజ్ గ్రూపుల పేరుతో రూ.12 లక్షలకు టోకరా
*బ్యాంక్ సొమ్ము కాజేసినా వారిపై చర్యలేవి
*అక్రమార్కులను కాపాడే ప్రయత్నంలో అధికారులు?
కారేపల్లి,మహా:పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసక్కలాడినట్టు పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో కారేపల్లి మండల ఐకేపీలో ఎక్కడా జరగని విధంగా పలువురు బరితెగించి భారీ అక్రమానికి పాల్పడ్డారు.గ్రామంలోనే లేని ఏడుగురు ముస్లింలతో పాటు మరో నలుగురి పేరుతో వినాయక పేరుతో ఓ గ్రూపును తయారుచేసి తద్వారా లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాన్ని కాజేశారు.సంస్థలను కాపాడాల్సిన అధికారులే అడ్డగోలు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు.ఐకెపి అధికారులు అప్పటి బుక్ కీపర్ నజీర్, గ్రామదీపిక,సీసీ గౌసియా,అప్పటి ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ భాస్కర్ కుమ్మక్కై ఫేక్ గ్రూపులతో బ్యాంకు సొమ్ము కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘనులు ఉత్తుత్తి గ్రూపులతో భారీ అక్రమానికి తెరలేపారు.నిబంధనలకు విరుద్ధంగా ఆ గ్రామానికి ఏమాత్రం సంబంధం లేని,వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులను ఆయా గ్రూపుల్లో సభ్యులుగా చేర్చి కారేపల్లి లోని గ్రామీణ వికాస్ బ్యాంకులో బ్యాంకు లింకేజీ రుణం కింద రూ. 12 లక్షలు కాజేశారు.
*వినాయక్ ఫేక్ గ్రూపు పేరుతో అక్రమం…
కారేపల్లి మండలంలోని మోట్లగూడెం గ్రామంలో ముస్లిమ్స్ కుటుంబాలు లేనే లేవు.కేవలం ఒకటే కుటుంబం ఉన్నా సంబంధిత వ్యక్తులెవరు కూడా ప్రస్తుతం గ్రామంలో ఉండడం లేదు.ఇతర ప్రాంతాలకు చెందిన ఏడుగురు ముస్లిమ్స్ తో పాటు వేరే గ్రామాలకు చెందిన మరో ముగ్గురిని వినాయక పేరుతో ఉన్న ఈ ఫేక్ గ్రూపులో సభ్యులుగా చూపించారు.ఈ గ్రూపులో షేక్ షకీరా, షేక్ రజియా,షేక్ పర్వీన్,షేక్ జకియా, మహమ్మద్ షబానా,షేక్ షాహిన్, షేక్ ఫయాజ్,నల్లపాటి జయప్రద, నెల్లి రేణుక,నెల్లి పద్మ పేర్లతో ఫైల్ సబ్మిట్ చేసి 6 లక్షల రూపాయల రుణం కాజేశారు.
*స్వరాజ్ గ్రూప్ పేరుతోనూ అక్రమం…
స్వరాజ్ గ్రూపులో మోట్ల గూడెం గ్రామానికి చెందిన ఇద్దరిని వయసు మీరి పోయిందనే కారణంతో తొలగించినట్లు చెబుతున్న వాళ్ల పేరిట రుణం ఇంకా కొనసాగుతూనే ఉంది. సంబంధిత సీసీ,బుక్ కీపర్ కు సంబంధించిన మరో ఫేక్ ముగ్గురిని సభ్యులుగా చేర్పించి ఇక్కడ కూడా మరో అక్రమానికి పాల్పడ్డారు.ఈ గ్రూపులో కూడా ముగ్గురు ముస్లింలను సభ్యులుగా చేర్చారు.షేక్ షమీనా, సయ్యద్ ముబీనా, షేక్ షమీన్ ఈ ముగ్గురి తో పాటు గ్రామానికి చెందిన మరో ఏడుగురు సభ్యులు ఈ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారు.కాగా క్షేత్రస్థాయి విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.గ్రూపులో వారి పేర్లు ఉన్నప్పటికీ వారికి ఏమాత్రం తెలవకుండా మరో 6 లక్షలు కాజేశారు. గ్రూపులో ఉన్న వారిని విచారిస్తే మేము తెచ్చిన అప్పులను కట్టేశామని, కొత్తగా తీసుకున్న అప్పుతో వారికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మోట్లగూడెం గ్రామానికి చెందిన స్వరాజ్, వినాయక్ గ్రూపుల్లో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి అప్పటి గ్రామ దీపిక, అప్పటి సీసీ వారికి సంబంధించిన బంధువులు, స్నేహితుల పేర్లను చేర్చి బ్యాంకు లింకేజీ కోసం కారేపల్లి లోని గ్రామీణ వికాస బ్యాంకులో రెండు గ్రూపుల్లో సుమారు 12 లక్షలు కాజేశారు.అధికారులు ఇచ్చిన ఫైల్ లో గ్రూపు సభ్యులందరి ఆధార్ కార్డులను ఐకెపి అధికారులు సమర్పించారు. వాటిని తప్పనిసరిగా వెరిఫై చేయాల్సిన బాధ్యత బ్యాంకు మేనేజర్ పై ఉంటుంది.ఐకెపి అధికారులతో కుమ్మక్కైన బ్యాంకు మేనేజర్ వివిధ ప్రాంతాలకు చెందిన ఆధార్ కార్డు దారులు వివిధ బ్యాంకుల అకౌంట్ల నెంబర్లు ఇచ్చినప్పటికీ వాటిని పరిశీలించకుండానే బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయడం పట్ల సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ 12 లక్షలను పంచుకున్న వారు కొన్ని నెలలు అనుమానం రాకుండా వాయిదాలను కూడా కట్టారు. అనంతరం ఈ రెండు గ్రూపుల అప్పు రోజురోజుకి పెరిగిపోయి మొండి బకాయి జాబితాలో చేరింది.
అయ్యా.. మేమసలు అప్పునే తీసుకోలేదు:
స్వరాజ్ పేరుతో ఉన్న గ్రూపు ద్వారా మేము తీసుకున్న బాకీలను గతంలోనే చెల్లించడం జరిగింది.రెండోసారి మా ప్రమేయం లేకుండా తీసుకున్న అప్పు తో మాకు ఎటువంటి సంబంధం లేదు.అప్పు కోసం మేము ఏ బ్యాంకుకు కూడా వెళ్ళలేదు.మా ప్రమేయం లేకుండానే మా పేర్లతో గ్రూపును కొనసాగించిన వారిపై సంబంధిత అధికారులే చర్యలు తీసుకోవాలయ్యా.
గుర్రం మంగమ్మ..మొట్లగూడెం








