- చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు
- సౌందరరాజన్ కన్నుమూత
- హుండీ లేకుండానే చిలుకూరు దేవాలయాన్ని నిర్వహించిన పూజారి
- సౌందరరాజన్ మృతి పట్ల పలువురి సంతాపం
హైదరాబాద్, మహా : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్‌రాజన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కాగా, సౌందరరాజన్ తన అర్చక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నత విద్యనభ్యసించాడు. కామర్స్ లెక్చరర్‌గా పని చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. ముగ్గురు మగపిల్లల్లో రంగరాజన్ (ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులు) రెండో వాడు. సౌందర్‌రాజన్ మరణవార్త తెలిసి అర్చకలోకం విషాదంలో మునిగిపోయింది. సౌందర్‌రాజన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని దైవాన్ని వేడుకుంటున్నారు.
దశాబ్దాల పాటు స్వామివారి సేవలో నిమగ్నమై, క్రమశిక్షణతో, అంకితభావంతో ఆలయ పరిపాలన నిర్వహించిన ఆయన సేవలు చిరస్మరణీయమైనవి. భక్తులతో ఎంతో మమకారంగా మెలిగి, స్వామివారి మహిమను ప్రశాంతంగా వివరిస్తూ వేలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా నిలిచారు.
వీసా దేవుడిగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవాలయం అనతికాలంలోనే భక్తుల తాకిడితో కిటకిటలాడింది. అత్యంత పురాతనమైన ఆలయం కావడంతో ఆలయ విశిష్టత ఏ మాత్రం దెబ్బతినకుండా ఉండేందుకు సౌందరరాజన్ అనేక సంస్కరణలను తీసుకు వచ్చి దేవాలయాలకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అనేక చర్యలను చేపట్టారు. హిందూ ధర్మ వ్యాప్తికి తన వంతు సహాయాన్ని అందించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వారికి తన వంతు పూర్తి సహకారాన్ని సౌందరరాజన్ అందించారు.
దేవాలయంలో హుండీ లేకుండా చేసిన మహనీయుడు
సాధారణంగా దేవాలయమంటే హుందీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఎంతో ప్రసిద్ధి చెందిన చిలుకూరు ఆలయంలో హుండీని ఏర్పాటు చేయకుండా దేవాలయాన్ని నిర్వహించిన సౌందరరాజన్ పూజారులను సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. దేవాలయంలో హుందీని ఏర్పాటు చేస్తే భక్తుల మనోభావాలు ఎలా ఉన్నా హుండీ ద్వారా వచ్చే ఆదాయం కోసం దేవాలయాన్ని ఎండో మెంట్ తనవశం చేసుకుంటుందన్నది సౌందరరాజన్ అభిప్రాయం అందుకే ఆన చిలుకూరు దేవాలయంలో హుండీని ఏర్పాటు చేయడానికి నిరాకరించి భక్తుల మనసును కూడా దోచుకున్నారు.








