హైదరాబాద్, మహా : ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు శ్రీ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందర రాజన్ గారు మరణించారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా,రిజిస్ట్రార్‌గా ఎంతో మంచి పేరు గడించిన సౌందర రాజన్ గారు ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. సౌందర రాజన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని,ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్థించారు.సౌందర రాజన్ గారి మృతిపట్ల ముఖ్యమంత్రి గారు వారి కుటుంబానికి, శ్రేయోభిలాషులకు సంతాపాన్ని,ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కిషన్ రెడ్డి సంతాపం
హైదరాబాద్, మహా : సౌందరరాజన్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం సౌందర రాజన్ చేసిన తృషి మరువలేనిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తికోసం వారు చేసి ఉద్యమాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. దేవుడిని, దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలనే లక్ష్యంతో.. కేవలం ‘వాక్’ పత్రిక విక్రయాల ద్వారా మందిరాన్ని నడిపి చూపించిన ఆదర్శశీలి అని అన్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చిలుకూరు బాలాజీ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే.. దీటుగా ఎదుర్కుని.. మందిరాన్ని భక్తులకోసం నిలబెట్టిన వ్యక్తిత్వం వారిదని, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటంలో, అదే సమయంలో అర్చకుల హక్కుల పరిరక్షణలో ముందుండి నడిచారని గుర్తు చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రాంచందర్ రావు సంతాపం
హైదరాబాద్, మహా :చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు డాక్టర్ సాందర్ రాజన్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులకు వివిధ సూచనలు ఇస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం భక్తులలో వారిపై వారికి విశ్వాసం కలిగించేలా బోధనలు చేస్తూ శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజకు అంకితమైన వ్యక్తి అని, నా విద్యార్థి దశ నుండే పరిచయం(గత 40 సంవత్సరాలుగా) ఉన్న వ్యక్తి. నాకు అత్యంత ఆత్మీయుడని పేర్కొన్నారు. వారి మరణం ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటని, భక్తుల హృదయాల్లో ఆయనకు ఉన్న స్థానం ఎప్పటికీ చెరిగిపోదన్నారు. దేవాలయాలలో హుండి పెట్టి దేవాలయాలను ఆక్రమించుకునే రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలిని ఎండ గడుతూ చిలుకూరు దేవాలయాన్ని హుండీ లేని దేవాలయంగా మార్చిన ఘనత డాక్టర్ సాందర్ రాజన్ గారిదేనని అన్నారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ప్రభుత్వాలతో వారు చేసిన పోరాటం భవిష్యత్ తరాలకు మార్గదర్శకమని, దేవాలయాలు ఆధ్యాత్మికకు భక్తి మార్గానికి నిలయాలుగా ఉండాలని వ్యాపార ధోరణిని విడనాడాలని భక్తుల సహాయ సహకారాల లతో దేవాలయాలు నడపచ్చని నిరూపించిన వ్యక్తి అని ప్రస్తుతించారు. డాక్టర్ సాందర్ రాజన్ మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు, వారి శిష్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.








