భర్త మృతిని తట్టుకోలేక భార్య మృతి
4 గంటల వ్యవధిలోనే దంపతుల కన్నుమూత
జగిత్యాల, మహా: జగిత్యాల జిల్లాలో హృదయాన్ని కలిచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మద్దులపల్లి గ్రామానికి చెందిన ఆయన తల్లిదండ్రులు చుక్కరెడ్డి, శంకరవ్వ కేవలం 4 గంటల వ్యవధిలోనే కన్నుమూశారు.
సమాచారం ప్రకారం… చుక్కరెడ్డి అనారోగ్యంతో బుధవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఈ విషాదాన్ని తట్టుకోలేక ఆయన భార్య శంకరవ్వ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
భర్త మృతితో తీవ్రంగా కలత చెందిన ఆమె అదే రోజు రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో కన్నుమూశారు.
నాలుగు గంటల వ్యవధిలోనే దంపతులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. కుమారుడు సత్తిరెడ్డి నాలుగు రోజుల క్రితమే వ్యవసాయ విజ్ఞాన యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో మద్దులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.








