- బొగ్గు సమీకరణకు
- ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వండి
- విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోండి
- సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, మహా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో ఎన్ టీపీసీ ఏర్పాటు చేయనున్న థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకునేందుకు ఎన్ టీపీసీకి తగిన స్వేచ్ఛను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు. సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఎన్టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకోవాలని సూచించారు. 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మొదటి ఫేజ్ లో లాగే రెండవ ఫేజ్ లో ఉత్పత్తి చేసే విద్యుత్ లో 85 శాతం విద్యుత్ ను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సరఫరా అవుతుందని కిషన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావించారు. 3 మార్చి, 2026 న తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 18,139 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదయ్యిందని గుర్తు చేశారు. రానున్న రోజులలో ఈ డిమాండ్ మరింతగా పెరగనుందన్నారు. అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిసిందని పేర్కొన్నారు.
ఎన్ టీపీసీ సిద్ధంగా ఉంది
“అతి తక్కువ ఖర్చుతో, అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో థర్మల్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడంలో ఎన్ టీపీసీకి దేశంలోనే విశేషమైన అనుభవం ఉంది. గతంలో విద్యుత్ రంగం మీద రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చలో భాగంగా మొదటి ఫేజ్ లో భాగంగా ఎన్ టీపీసీ రామగుండంలో ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టును గురించి స్వయంగా మీరు ప్రశంసించారు. ఇప్పుడు 5X800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్ టీపీసీకి తగిన స్వేచ్ఛను ఇవ్వండి. థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ధరకే ఉత్పత్తి చేసి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి ఎన్ టీపీసీ సిద్ధంగా ఉంది” అని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. “రామగుండంలో ఏర్పాటు చేయనున్న 3X800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకునేలా కృషి చేయాలి. అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు మేలు చేకూర్చే రామగుండం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సహకరించాలి” అని సూచించారు.







