- టిడిపి నుంచి పుట్టా సస్పెండ్…!?
- డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ
- ఎంపీ తీరుపై టీడీపీ సీరియస్
- విచారణకు కమిటీ వేయనున్న పార్టీ
- నిజమని తేలితే చర్యలు తధ్యం
- సీరియస్ గా తీసుకున్న అధినేత చంద్రబాబు
అమరావతి, మహా : డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌ను టిడిపి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా…? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్ పార్టీలో ఎంపి పుట్టా మహేష్ పాల్గొన్నారని, ఈ సందర్భంగా ఆయనను కూడా పోలీసులు అరెస్టు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో తొలుత ఆయనకు నెగిటివ్ వచ్చిందని, తరువాత నిర్వహించిన మరో వైద్య పరీక్షలో ఆయనకు పాజిటివ్ వచ్చిందని తేలింది. దీంతో ఆయన డ్రగ్స్ తీసుకున్నారని తేలిపోయింది. ఎంపీని అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు స్టేషన్ బెయిల్ పై వదిలేశారు.
పుట్టా డ్రగ్స్ కేసులో దొరికిన వైనంపై అధికార టిడిపి పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఒక ఎంపి అయి ఉండి..ఇలాంటి పనిచేస్తారా..? ఆయన వల్ల పార్టీకి ఇబ్బందులు వచ్చాయని, ఇది పార్టీకి, ఆయనకు కోలుకోలేని దెబ్బ అని టిడిపి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికాయని, విద్యార్థులను, యువకులను వైకాపా నేతలు వాటికి బానిసలుగా మార్చేశారని టిడిపి నేతలు ఆరోపించేవారు. అంతే కాకుండా వైకాపా నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని విమర్శలు, ఆరోపణలు గుప్పించేవారు. ఇదంతా వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు వైకాపాపై చేసే విమర్శలు. అయితే..చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత ఆయన డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్ కనపడడానికి వీలు లేదంటూ ఒక ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. దీనిపై అవగాహన కార్యక్రమాలతో పాటు, విస్తృతంగా విద్యార్ధులతో, ప్రభుత్వ ప్రతినిధులతో ర్యాలీలు చేయిస్తోంది. గత వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలను తాము కడిగేస్తున్నామని టిడిపి నేతలు ఘనంగా చెప్పుకుంటున్నారు. వైకాపా అంటేనే గంజాయి, డ్రగ్స్ అని టిడిపి నేతలు ప్రచారం చేశారు. చాలా మంది ప్రజలు కూడా వైకాపాను అలానే చూశారు…నమ్మారు. అయితే..ఇప్పుడు హఠాత్తుగా టిడిపి పార్లమెంట్ సభ్యుడు నేరుగా డ్రగ్స్‌ను స్వీకరించి పోలీసులకు దొరికిపోవడం టిడిపిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ విషయంలో వారు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. తప్పు చేసిన తమ ఎంపినీ వెనుకేసుకు రాలేక, ప్రతిపక్ష వైకాపా చేస్తోన్న ఆరోపణలు సమాధానం చెప్పలేక కిందా మీదా అవుతున్నారు. పార్టీ పెద్దలు ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనను వ్యక్తం చేయలేదు. అయితే విశ్వసనీయంగా అందుతోన్న సమాచారం ప్రకారం పుట్టా మహేష్ కుమార్‌పై గట్టి చర్యలే ఉంటాయని, ఆయనపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటారని కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.
సస్పెండా…? బహిష్కరణా…!?
క్రమశిక్షణకు, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే తెలుగుదేశం పార్టీలో పార్టీ ఎంపి ఈ విధమైన అసాంఘిక కార్యక్రమానికి పాల్పడడంతో పార్టీ గట్టి చర్య తీసుకుని మిగతావారికి ఒక హెచ్చరిక పంపాలనే భావనతో ఉంది. ముందుగా ఈ విషయంపై నిజానిజాలను ఒక కమిటీ ద్వారా తెలుసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కమిటీ ఒక నివేదిక ఇచ్చిన తరువాత ఆయనపై సస్పెండ్ వేటు వేస్తారని, లేదా పార్టీ నుంచి బహిష్కరిస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఆయనను పార్టీకి దూరంగా ఉండాలని స్పష్టం చేశారని, తరువాత కమిటీ నివేదిక తరువాత చర్యలు ప్రకటిస్తారంటున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీ సీనియర్ నాయకులు, మైదుకూరు ఎమ్మెల్యే అయిన పుట్టా సుధాకర్ యాదవ్‌కు పుట్టా మహేష్‌కుమార్ స్వయంగా తనయుడు. అంతే కాకుండా టిడిపి పోలిట్‌బ్యూర్ సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు ఈయన అత్యంత దగ్గర బంధువు. వాస్తవానికి పుట్టా మహేష్ కుమార్ టిడిపిలో ఉన్నప్పటికీ మొదటి నుంచి తెలంగాణకు చెందిన బిఆర్ఎస్ నేతలతో దగ్గర సంబంధాలను నెరపుతున్నారు. సికింద్రాబాద్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోనూ ఈయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. తెలంగాణలో డర్టీ రాజకీయాలు చేసే నాయకులతో ఉన్న సంబంధాలే ఇప్పుడు పుట్టా మహేష్ కొంప ముంచాయనే ప్రచారం ఉంది. మొత్తం మీద ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ ఎంపిపై తుడుచుకోలేని మచ్చ పడింది. ఈ మచ్చ ఆయన రాజకీయ జీవితానికి పుల్‌స్టాప్ పెడుతుందేమో చూడాలి మరి.








