హైదరాబాద్, మహా.
బాణీ ఏదైనా, పాట ఏదైనా తనదైన గొంతుతో ఉర్రూతలూగించే సింగర్ మంగ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ పెను వివాదంలో చిక్కుకున్నారు. శివరాత్రి, బోనాలు అనగానే ముందుగా గుర్తొచ్చే మంగ్లీ.. ఇప్పుడు పచ్చి బూతు పదాలతో కూడిన ఓ డబుల్ మీనింగ్ పాట పాడి నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా హీరోగా, డైరెక్టర్ ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’ . ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విడుదలైన ఓ ఐటెం సాంగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా మారింది. బాలీవుడ్ ఐటెం బాంబ్ నోరా ఫతేహి, సీనియర్ నటుడు సంజయ్ దత్‌లపై చిత్రీకరించిన ‘సర్కే చునర్ తేరీ సర్కే’ అనే పాట విపరీతమైన ట్రోలింగ్‌కు గురై, ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసే స్థాయికి చేరింది.
ఈ పాటలో వాడిన పదజాలం అత్యంత అసభ్యకరంగా, స్త్రీలను కించపరిచేలా ఉందని నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. హిందీలో రాకీబ్ ఆలం రాసిన ఈ పాటను తెలుగు సింగర్ మంగ్లీ ఆలపించడం విశేషం. పాటలోని “పహ్లే ఉఠాలే.. అందర్ వో డాలే.. నీచే ఏక్ బుంద్ నా గిరాయే.. కర్కే నికాలే ఖాళీ” అనే లైన్స్ పచ్చి శృంగారాన్ని, అశ్లీలతను సూచిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. పాట రచయితలు ఇది కేవలం ‘మందు బాటిల్’ గురించి రాసిన పాట అని సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వినేవారికి మాత్రం ఇది పక్కా డబుల్ మీనింగ్, వెకిలి పదజాలం అని స్పష్టమవుతోంది. ఇలాంటి పాటలను సమాజంలోకి వదిలితే యువతపై, ముఖ్యంగా చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తి పాటలతో తెలుగు లోగిళ్లలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మంగ్లీ.. ఇలాంటి అర్థం లేని, అసభ్యకరమైన పాటను పాడుతూ ఎలా కక్కుర్తి పడిందంటూ తెలుగు ప్రేక్షకులు సైతం సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ పాటపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ సైతం ఈ పాటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన టైమ్‌లైన్‌లో ఈ పాట చూసి తాను విన్నది నిజమేనా అని ఒకటికి రెండుసార్లు ప్లే చేసుకున్నానని, కమర్షియల్ పాటల సాహిత్యం ఇంతలా దిగజారిపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. ఒక పాటను ఈ స్థాయిలో బ్రష్టుపట్టిస్తారా అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తదితరులు సైతం పాటలోని అసభ్యతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ దత్ లాంటి సీనియర్ స్టార్ హీరో ఇలాంటి చీప్ సాంగ్ లో నటించడంపై ఆయన అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు.
ఈ వివాదం ముదిరి పాకాన పడటంతో వ్యవహారం న్యాయపరమైన చిక్కులకు దారితీసింది. సామాజిక కార్యకర్త, న్యాయవాది వినీత్ జిందాల్.. ఈ పాటపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలతో పాటు ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పాటలో వాడిన పదాలు బహిరంగ ప్రదర్శనకు ఏమాత్రం తగవని, తక్షణమే దీన్ని బ్యాన్ చేసి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య, గాయని మంగ్లీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయి లీగల్ నోటీసులు జారీ చేసింది. పరిస్థితి చేయి దాటిపోతుండటం, భారీ ఎత్తున నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుండటంతో కంగుతిన్న ‘కేడీ’ చిత్ర బృందం హుటాహుటిన దిద్దుబాటు చర్యలకు దిగింది. నిరసన జ్వాలల దెబ్బకు తలొగ్గి యూట్యూబ్ సహా అన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఈ పాట హిందీ వెర్షన్‌ను ప్రైవేట్‌లో పెట్టి తొలగించింది. ఏదేమైనా, ఒకప్పుడు తన గాత్రంతో ఎంతో ఆదరణ పొందిన మంగ్లీ.. తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని స్థాయిలో విమర్శల పాలవుతుండటం గమనార్హం.








