Mahaa Daily Exclusive

  భద్రాద్రికి మహర్దశ: మూడు దశల్లో ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. మంత్రుల సమీక్షలో కీలక నిర్ణయాలు!

Share

  • భ‌ద్రాచలం దేవ‌స్ధానం అభివృద్దికి మాస్ట‌ర్ ప్లాన్‌
  • మూడు ద‌శల్లో అభివృద్ధి ప‌నులు
  • మాస్ట‌ర్ ప్లాన్‌పై చ‌ర్చించిన మంత్రులు పొంగులేటి, సురేఖ‌, తుమ్మ‌ల‌, వాకిటి

హైదరాబాద్: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, కొండా సురేఖ‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, వాకాటి శ్రీ‌హ‌రి అన్నారు. భద్రాద్రిని ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని వెల్లడించారు. భద్రాచలం ఆలయ రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై శుక్ర‌వారం సచివాల‌యంలోని మంత్రి కొండా సురేఖ కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ రెండు వంద‌ల సంవ‌త్స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని ఆగ‌మ శాస్త్రం ప్ర‌కారం భ‌క్తుల మ‌నోభావాల‌కు అనుగుణంగా మూడు ద‌శల్లో ఆల‌యాన్ని అభివృద్ది చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. దీనిపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో చ‌ర్చించిన త‌ర్వాత మాస్ట‌ర్ ప్లాన్‌కు తుదిరూపునివ్వాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. వ‌చ్చే ఏడాది గోదావరి పుష్క‌రాలు ప్రారంభ‌మ‌య్యేనాటికి భ‌ద్రాచ‌లంలో పుష్క‌ర ఘాట్‌తో పాటు మొద‌టి ద‌శ ఆల‌య అభివృద్ది ప‌నులు పూర్త‌య్యేలా ప్ర‌ణాళికలు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామ‌న్నారు. భ‌ద్రాచ‌లం స‌మీపంలోని రామ‌వ‌రంలో ట్రైబ‌ల్ మ్యూజియం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. గోదావ‌రి పుష్క‌రాల‌లో భాగంగా అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన కొరివి వీర‌భ‌ద్ర‌స్వామి దేవాల‌యం, మల్లూరులోని న‌రసింహాస్వామి దేవాల‌యాల‌ను కూడా అభివృద్ది చేయాల‌ని సూచించారు. స‌మావేశంలో పార్ల‌మెంట్ స‌భ్యులు బ‌ల‌రాం నాయిక్ , శాస‌న‌స‌భ్యులు తెల్లం వెంక‌ట‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Latest