- వంద మందికి పైగా సైనికులతో వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ విమానం క్రాష్.
- పుటుమాయో ప్రావిన్స్‌లో టేకాఫ్ సమయంలోనే కుప్పకూలిన వైనం.
- మంటల్లో కాలిబూడిదవుతున్న లోహవిహంగం.
- ప్రమాదాన్ని ధ్రువీకరించిన కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్.
హైదరాబాద్, మహా.
దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ వైమానిక దళానికి (ఎయిర్ ఫోర్స్) చెందిన ఒక భారీ సైనిక విమానం ఘోర ప్రమాదానికి గురైంది. విధుల్లో భాగంగా వంద మందికి పైగా సైనికులను తీసుకుని గమ్యస్థానాలకు బయలుదేరిన ఈ విమానం, పుటుమాయో ప్రావిన్స్ పరిధిలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రన్ వే పైనుంచి గాల్లోకి ఎగిరే (టేకాఫ్) సమయంలోనే ఈ ఘోరం జరిగిందని కొలంబియా దేశ డిఫెన్స్ మినిస్టర్ (రక్షణ మంత్రి) పెడ్రో సాంచెజ్ అధికారికంగా వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగలు కమ్ముకుని, మంటల్లో విమానం పూర్తిగా కాలిబూడిదవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను తీవ్రంగా కలచివేస్తున్నాయి.
ఈ ఘోర ప్రమాద సమయంలో విమానంలో వంద మందికి పైగా సైనికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విమానం కుప్పకూలిన తీరు, చెలరేగిన మంటల తీవ్రతను బట్టి చూస్తే.. అందులో ప్రయాణిస్తున్న వారెవరూ ప్రాణాలతో బతికిబట్టకట్టే అవకాశాలు కనిపించడం లేదని, సుమారు 100 మందికి పైగా సజీవ దహనమై ఉంటారని స్థానిక మీడియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన రెస్క్యూ (సహాయక) ఆపరేషన్ కొనసాగుతోంది. మృతదేహాలను వెలికితీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.






