Mahaa Daily Exclusive

  సామర్లకోటలో భారీ చోరీ.. కిలో బంగారం స్వాహా..! 

Share

సామర్లకోట, మహా.

జీవితకాలం కష్టపడి కూడబెట్టుకున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి సొమ్మును దొంగలు రాత్రికి రాత్రే ఊడ్చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో జరిగిన ఈ భారీ చోరీ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోటలో నివాసం ఉంటున్న సదరు రిటైర్డ్ టీచర్, తన కుటుంబ సభ్యులతో కలిసి పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఇంటి పరిసరాలను నిశితంగా గమనించి, పక్కా ప్రణాళికతో లోపలికి చొరబడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన కిలాడీలు, నేరుగా బీరువాల వద్దకు చేరుకుని వస్తువులన్నింటినీ చిందరవందర చేశారు.

కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండటంతో వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వెంటనే లోపలికి వెళ్లి బీరువాలను పరిశీలించగా.. అందులో భద్రపరిచిన సుమారు కిలో బంగారు ఆభరణాలు, ఐదు కిలోల వెండి వస్తువులు కనిపించకుండా పోయాయి. వాటిని గుర్తుతెలియని దుండగులు అపహరించినట్లు గుర్తించిన బాధితులు లబోదిబోమంటూ కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఇంట్లో దొంగల వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఇది పక్కాగా తెలిసిన వారి పనేనా, లేక ప్రొఫెషనల్ దొంగల ముఠా పనా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సైతం నిశితంగా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.