Mahaa Daily Exclusive

  కట్టుకున్న భార్యకే కడుపుకోత..! అబార్షన్ చేయించి కెనడా చెక్కేసిన భర్త..! 

Share

  • 50 తులాల బంగారం, 30 లక్షల నగదు స్వాహా.
  • అనకాపల్లి జిల్లాలో గృహహింస కలకలం..
  • పోలీసుల చుట్టూ తిరుగుతున్నా దక్కని ఊరట.
  • న్యాయం కోసం బాధితురాలి పోరాటం.

అనకాపల్లి, మహా.

 

కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడయ్యాడు. పుట్టబోయే బిడ్డను అబార్షన్ చేయించి, భార్యను నట్టేట ముంచి కెనడా చెక్కేసిన అమానుష ఘటన అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలు తనను మోసం చేసిన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినా, ఫలితం లేకపోగా స్టేషన్ చుట్టూ తిప్పుతూ పోలీసులు కాలయాపన చేస్తున్నారని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. నిందితుడు సద్గుణ తన వివాహ సమయంలో బాధితురాలి కుటుంబం నుంచి భారీగా కట్నకానుకలు అందుకున్నాడు. సుమారు 50 తులాల బంగారం, ఎకరాన్నర పొలం, అలాగే రూ. 30 లక్షల నగదును కట్నంగా ఇచ్చి తమ కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించారు. అయితే, కొద్దిరోజులకే సద్గుణ అసలు రంగు బయటపడింది. గర్భవతి అయిన భార్యను బలవంతంగా అబార్షన్ చేయించి, ఆపై ఆమెను ఇండియాలోనే వదిలేసి ఎవరికీ చెప్పకుండా కెనడాకు పరారయ్యాడు.

తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు అనకాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇక్కడే బాధితురాలికి అసలైన కష్టాలు మొదలయ్యాయి. నిందితుడు సద్గుణపై, అతడికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. బాధితురాలికి చుక్కలు చూపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడమే కాకుండా, విచారణ పేరుతో రోజులు గడుపుతూ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. కోట్ల విలువైన ఆస్తులు, నగదు ఇచ్చి మోసపోయామని, ఇప్పుడు న్యాయం చేయాల్సిన రక్షక భటులే తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నామని బాధిత కుటుంబం వాపోతోంది. విదేశాలకు పరారైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.

Latest