Mahaa Daily Exclusive

  ప్రకాశం జిల్లాలో పెను విషాదం…

Share

ప్రకాశం జిల్లాలో పెను విషాదం.
*టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు.
12 మంది ప్రయాణికులు సజీవదహనం!
మార్కాపురం, మహా.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.

**ప్రమాదం జరిగిన తీరు**

జగిత్యాల , నిర్మల్ ప్రాంతాల నుండి నెల్లూరు జిల్లా వింజమూరు, ఉదయగిరి వైపు వెళ్తున్న ‘హరికృష్ణ ట్రావెల్స్’ బస్సు రాయవరం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి.

**సజీవదహనమైన ప్రయాణికులు**

బస్సులో మంటలు భారీగా ఎగసిపడటంతో ప్రయాణికులు బయటకు వచ్చే మార్గం లేక లోపలే చిక్కుకుపోయారు. ఈ భీతావాహ పరిస్థితిలో 12 మంది ప్రయాణికులు సజీవదహనం కాగా, మరో 10 మంది కిటికీల నుండి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు మరియు స్థానికులు వెంటనే మార్కాపురం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

**ఘటనా స్థలంలో భీతావాహ పరిస్థితి**

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. మృతుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో ఆ ప్రాంతమంతా ఆక్రందనలు, హాహాకారాలతో నిండిపోయింది.

**నిద్రమత్తు…అతివేగం?**

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం లేదా అతివేగంగా నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Latest