సజీవ దహనం కావడం అత్యంత బాధాకరం!
* ప్రాణాలు కోల్పోయిన మహిళలు, చిన్నారులకు బీజేపీ నేత ప్రగాఢ సానుభూతి.
* రవాణా భద్రతపై కఠిన చర్యలు చేపట్టాలి.
* క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: రామచందర్ రావు డిమాండ్.
హైదరాబాద్, మహా.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొనడం, అనంతరం చెలరేగిన మంటల్లో ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత కలచివేసే అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నిర్మల్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు, చిన్నారులు అగ్నిప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని రామచందర్ రావు పేర్కొన్నారు. మృతుల్లో అధిక శాతం కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం అందుతోందని, ఈ క్లిష్ట సమయంలో భగవంతుడు బాధితుల కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మంది క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని రామచందర్ రావు విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని కోరారు. ప్రైవేట్ వాహనాల భద్రత, రవాణా నిబంధనల అమలులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి హృదయవిదారక ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.







