Mahaa Daily Exclusive

  ప్రేమించి పెళ్లాడి.. ప్రాణం తీశాడు..! యూట్యూబర్‌ వైష్ణవి హత్యోదంతంలో వెలుగుచూసిన సంచలన విషయాలు.!

Share

  • ప్రేమించి పెళ్లాడి.. ప్రాణం తీశాడు.
  •  కట్నం కక్కుర్తికి గర్భవతి బలి!
  •  వూపిరి పోయాల్సిన వాడే వూపిరి తీశాడు.
  • 4 ఎకరాల పొలం కోసం భార్యను హతమార్చిన కిరాతకుడు.
  •  గర్భవతి అని వేడుకున్నా కనికరించని కఠినాత్ముడు.
  •  యూట్యూబర్‌ వైష్ణవి హత్యోదంతంలో వెలుగుచూసిన సంచలన విషయాలు.

హైదరాబాద్, మహా.

నమ్మిన వాడే నట్టేట ముంచాడు.. తోడుంటానని బాస చేసిన వాడే తుదిశ్వాస తీశాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌ గ్రామంలో జరిగిన యూట్యూబర్‌ వైష్ణవి హత్యోదంతం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది. ప్రేమ పేరుతో వెంటపడి, ప్రాణాలు తీసుకుంటానని బెదిరించి పెళ్లాడిన భర్త హరిబాబే.. చివరకు ఆమె పాలిట కాలయముడయ్యాడు. కేవలం నాలుగు ఎకరాల పొలం, మరికొంత కట్నం వస్తుందనే దురాశతో, నాలుగు నెలల గర్భవతి అని కూడా చూడకుండా కన్నకూతురిలా సాదుకున్న అత్తింటి వారికే తీరని శోకాన్ని మిగిల్చాడు. ఈ కిరాతకానికి సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు బుధవారం వెల్లడించారు.

 

**ప్రేమ ముసుగులో వంచన.**

 

వైష్ణవి కోరుట్ల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరింది. శిక్షణలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే క్రమంలో అక్కడ పేషెంట్ అటెండర్‌గా పనిచేసే హరిబాబు కంటపడింది. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. తొలుత నిరాకరించినప్పటికీ, ‘నీవు లేకుంటే బతకలేను’ అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో వైష్ణవి కనికరించి అతని ప్రేమను అంగీకరించింది. ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత వచ్చినా, వైష్ణవి తల్లిదండ్రులను ఒప్పించి పది నెలల క్రితం వీరి వివాహం ఘనంగా జరిగింది.

 

**ఇల్లరికపు అల్లుడికి నివాసం**

 

హరిబాబు కుటుంబం అతడిని వెలివేయడంతో, వైష్ణవి తల్లిదండ్రులు అతడిని తమ ఇంటికి ఆహ్వానించి ఇల్లరికపు అల్లుడిగా గౌరవించారు. వైష్ణవి యూట్యూబ్ వీడియోల ద్వారా సంపాదిస్తుండటంతో, హరిబాబు తన ఉద్యోగాన్ని వదిలేసి ఆమెతో కలిసి వీడియోలు చేసేవాడు. ఆమె కుటుంబం అతడికి రెండు గుంటల స్థలం కొనిచ్చి, ఇల్లు కట్టించేందుకు కూడా సిద్ధమైంది. అయితే, హరిబాబు కుటుంబ సభ్యులు మాత్రం అతని మనసులో విషం నింపారు. వైష్ణవిని వదిలించుకుని మరో పెళ్లి చేసుకుంటే 4 ఎకరాల భూమితో పాటు రూ.20 లక్షల కట్నం వస్తుందని ఆశ చూపారు. ఆ ఆస్తి పాశవికానికి హరిబాబు పశువులా మారాడు.

 

**గర్భవతి అని వేడుకున్నా**

 

ఈ నెల 16వ తేదీ రాత్రి నిద్రిస్తున్న వైష్ణవిపై హరిబాబు దాడికి తెగబడ్డాడు. దిండుతో ముఖాన్ని అదిమి పట్టి, గొంతు నులిమి కిరాతకంగా వ్యవహరించాడు. తాను నాలుగు నెలల గర్భవతిని అని, కడుపులోని బిడ్డనైనా చూడమని ఆమె ప్రాధేయపడినా ఆ మృగాడి మనసు కరగలేదు. గొంతు నులిమి చంపడమే కాకుండా, విచక్షణ రహితంగా కత్తితో పొడిచి ఆమె ప్రాణాలను గాలిలో కలిపేశాడు. పై గదిలో ఉన్న తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ‘మేము సరదాగా గడుపుతున్నాం’ అన్నట్లుగా నటించి వారిని నమ్మించాడు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్లు బ్రష్ చేసుకుని, అత్తింటి వారు కొనిచ్చిన బైక్‌పైనే పరారయ్యాడు.

 

**ముగ్గురు నిందితుల అరెస్టు**

 

వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, హరిబాబుతో పాటు అతనిని హత్యకు ప్రేరేపించిన తల్లి మరియు ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు. కట్టుకున్న భార్యనే కాకుండా, ఇంకా లోకాన్ని చూడని తన బిడ్డను కూడా పొట్టనబెట్టుకున్న హరిబాబుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కళాకారిణిగా ఎంతోమందిని అలరించిన వైష్ణవి, ఇలా తన సొంత మనిషి చేతిలోనే బలికావడం చూసి మాదాపూర్ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది.

Latest