Mahaa Daily Exclusive

  మీరేమైనా రాజులా..? గురుగ్రామ్ పోలీసులపై సుప్రీంకోర్టు నిప్పులు..!

Share

  • నాలుగేళ్ల చిన్నారి కేసులో పోలీసుల తీరుపై ‘సర్వోన్నత’ ఆగ్రహం.
  •  అధికారులను బదిలీ చేయాలని ఆదేశం.
  •  సిగ్గుండాలి.. చట్టం పట్ల కనీస అవగాహన లేదా?
  •  పోలీసులకు సుప్రీంకోర్టు మొట్టికాయలు.

న్యూఢిల్లీ ,మహా.

నాలుగేళ్ల పసిప్రాయంపై జరిగిన అమానుష అత్యాచారం కేసులో గురుగ్రామ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. బాధితురాలైన చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రుల పట్ల అధికారులు ప్రదర్శించిన నిర్లక్ష్యం, సున్నితత్వం లేని ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. బాధితురాలిని క్రాస్-ఎగ్జామినేషన్ చేసిన అధికారుల తీరును తీవ్రంగా మందలించింది. ఈ చర్యలు ఆ చిన్నారిని మరింత మానసిక వేదనకు గురిచేయడమే కాకుండా, వ్యవస్థపై గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ జరపకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “పోలీసులు బాధితురాలి ఇంటికి ఎందుకు వెళ్లలేరు? వాళ్లేమైనా రాజులా?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నిందితుడి సమక్షంలోనే మేజిస్ట్రేట్ ఆ చిన్నారిని ఎలా ప్రశ్నించారనే దానిపై పోలీసులు, జిల్లా న్యాయవ్యవస్థ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నిందితుడిని చూసి ఆ పసిగుండె ఎంత భయపడి ఉంటుందో కనీస ఆలోచన లేకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. నేరం జరిగిన 15 రోజుల వరకు కనీసం అరెస్టులు చేయలేదని, సుప్రీంకోర్టు ఈ కేసును పరిగణనలోకి తీసుకున్నాకే పోలీసులు నిద్రలేచారని ధర్మాసనం ఎద్దేవా చేసింది.

చిన్నారులపై లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్లను కుదించడంపై కోర్టు మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 ఏళ్ల జైలు శిక్ష పడే సెక్షన్ 6 నుంచి కేవలం పదేళ్ల శిక్ష పడే సెక్షన్ 10కి ఈ కేసును ఎందుకు మార్చారని హరియాణా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని నిలదీసింది. బాలల సంక్షేమ కమిటీ (CWC) నివేదిక ఆధారంగా అభియోగాలను మార్చినట్లు భాటి సమాధానమివ్వగా.. స్వయంగా బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం కంటే ఆ నివేదికకు ఎందుకు ప్రాధాన్యమిచ్చారని కోర్టు ప్రశ్నించింది. అసమర్థమైన విషయాన్ని సమర్థించవద్దని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేర తీవ్రతను తగ్గించేందుకే అత్యున్నత స్థాయి పోలీస్ అధికారులు రంగంలోకి దిగినట్లు కనిపిస్తోందని జస్టిస్ బాగ్చీ మండిపడ్డారు.

విచారణలో పాల్గొన్న డీసీపీ, ఏసీపీ హోదా కలిగిన అధికారులకు అత్యాచారం అనే పదానికి ఉన్న చట్టబద్ధమైన నిర్వచనంపై కనీస అవగాహన లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని కోర్టు పేర్కొంది. “పోలీసులు కనీసం చట్టాన్ని చదవలేదు.. నాలుగేళ్ల చిన్నారి నిర్దోషిత్వాన్ని నమ్మలేదు.. వారికి సిగ్గుండాలి” అని సీజేఐ తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. అఫిడవిట్‌లో పదేపదే బాధితురాలి పేరును ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని అభిప్రాయపడింది. రాష్ట్రానికి చట్టంపై కనీస గౌరవం ఉన్నా, ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులను తక్షణమే బదిలీ చేయాలని సూచించింది. సీడబ్ల్యూసీ సభ్యుల అర్హతలు, వారి నియామక ప్రక్రియపై కూడా వివరణ ఇవ్వాలని కోరుతూ విచారణను వాయిదా వేసింది.

Latest