- అసెంబ్లీ ముట్టడి
- రణరంగమైన హైదరాబాద్..
- గిరిజన గర్జనతో దద్దరిల్లిన అసెంబ్లీ పరిసరాలు
- పోలీసుల ఆంక్షలను ఛేదించి దూసుకెళ్లిన లంబాడి పోరాట యోధులు
హైదరాబాద్, మహా : తమ న్యాయమైన హక్కుల సాధన కోసం లంబాడి హక్కుల పోరాట సమితి శంఖారావం పూరించింది. బుధవారం పిలుపునిచ్చిన ‘అసెంబ్లీ ముట్టడి’ ఉప్పెనలా ఎగిసిపడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన గిరిజన బిడ్డల నినాదాలతో శాసనసభ పరిసరాలు మార్మోగాయి. పోలీసుల ఇనుప కంచెలు, భారీ బారికేడ్లను తుత్తునియలు చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లడంతో గంటల తరబడి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన పెనుగులాటలో అసెంబ్లీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది.
లంబా[ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ రాంబాల్ నాయక్ నేతృత్వంలో సాగిన ఈ పోరాటంలో గిరిజన గళం గర్జించింది. ఈ సందర్భంగా రాంబాల్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోందని, ఓట్ల కోసం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోందని నిప్పులు చెరిగారు. “మా తండాల్లో మేమే రాజులం.. మా హక్కుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం” అని హెచ్చరించారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుపైన 100 ఎకరాలు కేటాయించి సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ & మేరామాయండి ( భవాని మాత ) మందిరాన్ని నిర్మించాలని, సేవలాల్ మహారాజ్ పేరు పైన యూనివర్సిటీ నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగితాలపై కాకుండా, గిరిజన తండాలన్నింటినీ పూర్తిస్థాయి అధికారాలు కలిగిన రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించి నిధులు కేటాయించాలన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి గిరిజన సంస్కృతిని గౌరవించాలన్నారు. ట్రై కార్ కునిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
నేతల అరెస్టు
పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించినా, చెక్ పోస్టులను దాటుకుంటూ అసెంబ్లీ గేట్ల వరకు చేరుకున్న నేతలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. గిరిజన నేతల అరెస్టులతో నగరం ఒక్కసారిగా అట్టుడికింది. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఈ ఉద్యమం రాష్ట్రంలోని ప్రతి తండాకు వ్యాపిస్తుందని, సర్కార్ పతనం ఖాయమని ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, మోతిలాల్ నాయక్, కేశంపేట మండల అధ్యక్షులు రాజు నాయక్, జగన్ నాయక్, యూత్ విభాగం అధ్యక్షులు సంజు నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షులు అయోధ్య శ్రీనివాస్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పరశురాం నాయక్, శివా నాయక్, కేశంపేట్ నాయకులు శీను, కొత్తూరు మండల యువ నాయకులు నాగేష్ నాయక్, నరేష్ నాయక్, రాజు నాయక్ తదితరులున్నారు.







