Mahaa Daily Exclusive

  ఇంధన భద్రతపై ఆందోళన వద్దు..! వ్యూహాత్మక నిల్వలు పుష్కలం..

Share

  • అదనపు సరకుతో వస్తున్న నౌకలు!

• ఇంధన సరఫరాపై విపక్షాల సందేహాలను నివృత్తి చేసిన కేంద్రం.

• దేశ ప్రయోజనాల కోసం ఏకతాటిపైకి.. ప్రభుత్వ చర్యలకు విపక్షాల పూర్తి మద్దతు.

ఢిల్లీ, మహా.

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతపై భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని కేంద్రం భరోసా ఇచ్చింది. బుధవారం సాయంత్రం పార్లమెంటు భవనంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన కీలక అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది. సుమారు గంటా 45 నిమిషాల పాటు అత్యంత ప్రాధాన్యతతో సాగిన ఈ భేటీలో దేశ ఆర్థిక, రక్షణ , విదేశాంగ విధానాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.

ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో పాటు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పాల్గొన్నారు. విపక్షాల నుంచి కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, తారిఖ్ అన్వర్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు ధర్మేంద్ర యాదవ్, జావెద్ అలీ, సీపీఎం నుంచి జాన్ బ్రిట్టాస్, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంజయ్ సింగ్, డీఎంకే నేత పి. విల్సన్, జేడీయూ నేతలు రాజీవ్ సింగ్, సంజయ్ ఝా తదితరులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతినిధులు మాత్రం దూరంగా ఉండటం గమనార్హం.

ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మీదుగా సాగుతున్న షిప్‌మెంట్లు, ఎల్‌పీజీ లభ్యతపై విపక్ష నేతలు తమ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం గనుక తీవ్రరూపం దాల్చితే సామాన్యులపై పెట్రో భారం పడుతుందా అన్న సందేహాలను లేవనెత్తారు. దీనిపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులను, యుద్ధం వల్ల భారత్‌పై పడే ప్రభావాన్ని వివరించగా, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దేశీయ నిల్వలపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు నిలకడగా ఉన్నాయని, ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే వివిధ దేశాలతో సంప్రదింపులు జరిపి అడ్వాన్స్ బుకింగ్‌లు చేశామని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా, రానున్న నాలుగైదు రోజుల్లో అదనపు సరుకుతో కూడిన నాలుగు భారీ నౌకలు భారత తీరానికి చేరుకోనున్నాయని, దీనివల్ల ఎక్కడా కొరత అనేది తలెత్తబోదని హామీ ఇచ్చారు.

సమావేశం ముగిసిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు ఈ చర్చల్లో చురుకుగా పాల్గొన్నాయని తెలిపారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా తాము సమష్టిగా మద్దతు ఇస్తామని విపక్షాలు ఏకగ్రీవంగా హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం సైతం విపక్షాల ప్రశ్నలన్నింటికీ అత్యంత పారదర్శకంగా, సంతృప్తికరంగా సమాధానమిచ్చిందని రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దేశ ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని, ఏవైనా కీలక పరిణామాలు చోటుచేసుకుంటే విపక్షాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా అంతర్జాతీయ సంక్షోభ సమయంలో భారతదేశం ఒక్కటిగా నిలబడుతుందనే బలమైన సందేశం ప్రపంచ దేశాలకు వెళ్ళింది.

Latest