- నాగుపాముతో తలపడి ప్రాణాలర్పించిన ‘ఫోనీ’.. * భువనేశ్వర్‌లో విషాదం
భువనేశ్వర్: మహా.
జంతువులన్నింటిలో శునకం అత్యంత విశ్వాసమైనదని మరోసారి నిరూపితమైంది. తనను ప్రాణప్రదంగా చూసుకుంటున్న యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు ఒక పెంపుడు కుక్క ఏకంగా విషనాగుతోనే తలపడింది. భీకర పోరాటం చేసి ఆ సర్పం ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది కానీ, ఆ క్రమంలో పాము కాటుకు గురై తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని చిలి పోఖరి ప్రాంతంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఆ ప్రాంతానికి చెందిన ఝునా జెనా అనే మహిళ గత ఆరేళ్లుగా ‘ఫోనీ’ అనే డాష్హండ్ జాతి శునకాన్ని పెంచుకుంటోంది. తనకున్న నాలుగు కుక్కలలో ఫోనీని ఆమె సొంత బిడ్డలా అపురూపంగా చూసుకునేది.
ఆ రోజు ఉదయం ఇంట్లోని కుక్కలన్నీ ఒక్కసారిగా గట్టిగా మొరగడంతో జెనా బయటకు వచ్చి చూశారు. ఒక భారీ నాగుపాము ఇంటి గడప దాటి లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దానిని గమనించిన నాలుగు శునకాలు పామును చుట్టుముట్టి నిరోధించే ప్రయత్నం చేశాయి. సర్పానికి, శునకాలకు మధ్య కాసేపు పోరు సాగింది. జెనా ఆందోళనతో వాటిని వారించే ప్రయత్నం చేయగా.. మూడు కుక్కలు భయంతో వెనక్కి తగ్గినా, ఫోనీ మాత్రం వెనకడుగు వేయలేదు. యజమాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న ఆవేదనతో ఆ చిన్న ప్రాణి నాగుపాముతో వీరోచితంగా పోరాడింది. ఈ క్రమంలో కోబ్రా కాటు వేయడంతో ఫోనీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పాము కూడా కుక్కల దాడిలో ప్రాణాలు విడిచింది.
తీవ్ర అస్వస్థతకు గురైన ఫోనీని కాపాడుకునేందుకు జెనా తల్లడిల్లిపోయారు. వెంటనే దానిపై నీళ్లు చల్లి, సమీపంలోని షహీద్‌నగర్ యానిమల్ ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ అప్పటికే విషం శరీరం అంతా పాకడంతో ఫోనీ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరేళ్ల అనుబంధం కళ్లముందే తెగిపోవడంతో జెనా కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఈ ఘటనపై స్నేక్ హెల్ప్‌లైన్ ప్రతినిధులు స్పందిస్తూ కొన్ని కీలక సూచనలు చేశారు. పాము కాటుకు గురైన జంతువుల శరీరంపై నీరు పోయకూడదని, అలా చేస్తే రక్త ప్రసరణ వేగవంతమై విషం త్వరగా గుండెకు చేరుతుందని వివరించారు. సరైన అవగాహన లేకపోవడం, డాష్హండ్ జాతి శునకాలు పొట్టిగా ఉండటం వల్ల పాము కాటు వేయడం సులభతరమైందని వారు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా, తన యజమాని కోసం ప్రాణాలర్పించిన ఫోనీ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది.







