- అఫ్గానిస్థాన్‌కూ అప్పట్లోనే ఇనుము ఎగుమతులు!
- సంబల్‌పుర్ జిల్లాలో ప్రాచీన ఇనుప కర్మాగారం గుట్టురట్టు..
- వెలుగులోకి విస్తుపోయే నిజాలు.
భువనేశ్వర్: మహా.
భారతదేశ ప్రాచీన లోహ శాస్త్ర నైపుణ్యానికి అద్దం పట్టే అద్భుతమైన చారిత్రక ఆధారాలు ఒడిశాలో లభ్యమయ్యాయి. సంబల్‌పుర్ జిల్లాలోని రౌఢాఖోల్, బేత్గఢ్, లౌపాంక్ గ్రామాల్లో జరిపిన పరిశోధనల్లో సుమారు 1500 ఏళ్ల నాటి పురాతన ఇనుప పరిశ్రమ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గంగాధర్ మెహర్ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగాధిపతి డాక్టర్ అతుల్ కుమార్ ప్రధాన్ నేతృత్వంలో సాగిన ఈ అన్వేషణలో, నాటి కాలంలోనే భారతదేశం నుంచి అఫ్గానిస్థాన్ వంటి సుదూర దేశాలకు అత్యుత్తమ నాణ్యత కలిగిన ఇనుము ఎగుమతి అయ్యేదని వెల్లడైంది. ఈ ప్రాంతంలో సుమారు 20కి పైగా పారిశ్రామిక అవశేషాలను గుర్తించడం ద్వారా నాటి పారిశ్రామిక ప్రగతి ఎంత ఉన్నత స్థాయిలో ఉండేదో స్పష్టమవుతోంది.
ఈ పరిశోధనల్లో భాగంగా లభించిన భారీ కొలిమిలు, ఇనుప ఖనిజ వ్యర్థాలు చూస్తుంటే, అప్పట్లోనే ఇక్కడి ప్రజలు ఇనుము తయారీలో నిష్ణాతులని అర్థమవుతోంది. హేమటైట్ రాళ్లను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి, లోహాన్ని వేరు చేసే సంప్రదాయ పద్ధతుల్లో వారు ఆరితేరారు. ఒకప్పుడు ఈ ప్రాంతం ఇనుప ఖనిజంతో సమృద్ధిగా ఉండేదని, ఇక్కడి నుంచి తయారైన ఇనుముకు అంతర్జాతీయంగా భారీ గిరాకీ ఉండేదని రౌఢాఖోల్ రాజుల కాలం నాటి పత్రాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్రస్తుతం జరిపిన ప్రాథమిక అధ్యయనంలో ఇవి 1500 ఏళ్ల నాటివని తేలినప్పటికీ, శాస్త్రీయంగా కార్బన్ డేటింగ్ నిర్వహిస్తే ఇవి 2000 సంవత్సరాల క్రితానివేనని రుజువయ్యే అవకాశం ఉందని డాక్టర్ ప్రధాన్ పేర్కొన్నారు.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల పేర్లు ఇప్పటికీ ఇనుముతో ముడిపడి ఉండటం. ‘ఐరన్ పంచాయత్’ వంటి పేర్లు నాటి లోహ పరిశ్రమ వైభవాన్ని నేటికీ గుర్తుచేస్తున్నాయి. ఇప్పటికే భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో భీమ్మండల్ ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతుండగా, బెత్‌గఢ్ మరియు లౌపాంక్ పరిధిలో లభించిన ఈ కొత్త ఆధారాలు చరిత్రకారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పురాతన కర్మాగారాల రహస్యాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు మరిన్ని తవ్వకాలు జరపాలని, అందుకు అనుమతి కోరుతూ ఏఎస్ఐకి దరఖాస్తు చేయనున్నట్లు పరిశోధక బృందం వెల్లడించింది. ఈ అన్వేషణ ద్వారా ప్రాచీన భారతదేశం ప్రపంచ పారిశ్రామిక యవనికపై ఎంతటి కీలక పాత్ర పోషించిందో మరోసారి నిరూపితమవుతోంది.







