హైదరాబాద్, మహా.
తెలంగాణలో బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఆ వర్గాలను నమ్మించి వంచించిందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ సమీపంలో ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ నిరసన చేపట్టారు. బీసీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఆకాశమంత ఆశలు చూపి, తీరా అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిందని విమర్శించారు. ప్రతి వార్షిక బడ్జెట్లో బీసీల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆయన మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాష్ట్రానికి పిలిపించి, ఆయనతో అబద్ధాలు చెప్పించి బీసీల ఓట్లను దండుకున్నారని ఆరోపించారు. నిధుల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, రెండో ఏడాది రూ.11 వేల కోట్లు కేటాయించినట్లు చూపించి, కేవలం రూ.3 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చులకన భావానికి నిదర్శనమని తలసాని దుయ్యబట్టారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, వాటిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆయన గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో బీసీలకు దక్కిన గౌరవాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. లింగయ్య యాదవ్‌ను రాజ్యసభకు పంపడంతో పాటు, అనేక మంది బీసీ నేతలకు ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. అలాగే బీసీ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి, కుల వృత్తులను ప్రోత్సహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బీసీలు గమనిస్తున్నారని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమని తలసాని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బొంద పెడతారని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.







