విదేశీ వైద్య నిపుణుల సేవలు వినియోగించుకుంటాం. * పేదల వైద్యం కోసం రూ.4,500 కోట్లు.
* ఆరోగ్యశ్రీ బకాయిలపై ముఖ్యమంత్రి స్పష్టత.
* టీచింగ్ ఆస్పత్రుల బాధ్యత గ్రూప్-1 అధికారులకే.
* వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం.
* ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి .
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విదేశాల్లోని నిపుణులైన వైద్యుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలని భావిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. వైద్య రంగంలో అత్యాధునిక సాంకేతికతను, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని సామాన్యులకు చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాం నుంచి పేరుకుపోయిన రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చెల్లిస్తోందని, వైద్య సేవల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీ చెల్లింపుల వివరాలను వెల్లడిస్తూ.. ప్రతి నెలా సగటున రూ.89 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. గత పాలకుల నుంచి వచ్చిన బకాయిల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.240.11 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.360.16 కోట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకు తమ ప్రభుత్వం మొత్తం రూ.2408.51 కోట్లను బకాయిల కింద చెల్లించిందని, ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు అందజేసినట్లు వివరించారు. గడిచిన 27 నెలల్లో పేదల వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం రూ.4,500 కోట్లు వెచ్చించిందని సీఎం వెల్లడించారు. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన ఆయన, తమ హయాంలో పారదర్శకంగా రూ.2,046 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించామన్నారు.
వైద్య విద్య, పరిపాలనలో సంస్కరణలు తీసుకువస్తూ టీచింగ్ కాలేజీల నిర్వహణ బాధ్యతలను ఇకపై గ్రూప్-1 అధికారులకు అప్పగించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. టీచింగ్ కాలేజీలకు ఆశించిన స్థాయిలో రోగులు వెళ్లడం లేదని, అక్కడ మెరుగైన సౌకర్యాలు, పర్యవేక్షణ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేపడుతున్నట్లు చెప్పారు. పేదలపై ఆర్థిక భారం పడకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఇప్పటికే రూ.10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. వీటితో పాటు ప్రతి కుటుంబానికి భద్రత కల్పించేలా కొత్తగా జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్ర వైద్య ముఖచిత్రాన్ని మారుస్తాయని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.







