Mahaa Daily Exclusive

  ఓటు కోసం ‘చార్టర్డ్’ ఫ్లైట్: గల్ఫ్ మలయాళీల కోసం పార్టీల వినూత్న వ్యూహం.. కేరళ అసెంబ్లీ రేసులో ప్రవాసులే కీలకం!

Share

  • కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌
  • గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు
  • బుక్ చేస్తున్న పార్టీలు
  • మలబార్ ప్రాంతంలో గల్ఫ్ ఓటర్లే అధికం

మహా : అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళం రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణలో సర్పంచ్, లోకల్ బాడీ ఎన్నికలకు కనిపించే హడావుడి ప్రస్తుతం కేరళంలో కనిపిస్తోంది. వలస వెళ్లిన వారి కోసం ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేసి బస్‌లు వేసి రప్పించిన దృశ్యాలు సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో చూస్తాం. కానీ ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఓటు అత్యంత కీలకంగా మారిన పరిస్థితుల్లో అభ్యర్థుల జాతకాలను మార్చగల శక్తి ఉన్న ప్రవాస భారతీయులను రప్పించేందుకు పార్టీలు తెగ తాపత్రయ పడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న ఓటర్లను కేరళంకు రప్పించేందుకు ప్రత్యేకంగా చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయంటే ప్రవాస భారతీయుల బలమేంటో స్పష్టమవుతోంది.

గల్ఫ్‌ ఓటర్లే ఎందుకు కీలకం?

కేరళ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.23 లక్షల మంది ప్రవాస ఓటర్లు ఉన్నారు. సంఖ్యా పరంగా ఇది తక్కువగా అనిపించినా హోరాహోరీ సాగే పోరులో వీరి ఓట్లే గెలుపోటములను నిర్ణయించనున్నాయి. గత ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే అనేక నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్ చాలా స్వల్పంగా ఉంది. అటువంటి చోట్ల విదేశాల నుంచి వచ్చే వేల ఓట్లు అభ్యర్థుల భవిష్యత్‌ను తలకిందులు చేస్తాయి.

ఛార్టర్డ్‌ విమానాల వ్యూహంతో బరిలోకి దిగిన కాంగ్రెస్, ముస్లిం లీగ్‌

సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రవాస మలయాళీలు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి ఓటు వేస్తుంటారు. అయితే ఈసారి విమాన సర్వీసులు తగ్గింపు, విపరీతంగా పెరిగిన విమాన టికెట్ ధరలు వారిని వెనక్కి లాగుతున్నాయి. ఈ అడ్డంకిని తొలగించేందుకు కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ పార్టీలు చార్టర్డ్ విమానాలు ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ప్రవాస ఓటర్లు ఇబ్బంది పడుతున్నారని అందుకే ఈ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా ముస్లిం లీగ్ ఉత్తర కేరళకు చార్టర్డ్ విమానాలు నడిపిన అనుభవం ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ముస్లిం లీగ్ విదేశీ విభాగమైన కేరళ ముస్లిం కల్చరల్‌ కమిటీ ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని మలయాళీలను సమన్వయం చేసే పనిలో నిమగ్నమైంది. పోలింగ్ తేదీలకు సమీపంలో ఈ విమానాలను నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కేరళ కాంగ్రెస్ కూడా చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే ఈ సదుపాయం కేవలం అధిక విమాన ఖర్చులను భరించలేని కార్మిక వర్గ ఓటర్లు కోసమేనని చెబుతున్నారు.

మలబార్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి

ప్రవాస ఓటర్ల ప్రభావం కేరళం అంతటా ఉన్నప్పటికీ మలబార్‌ ప్రాంతంలో ఇది ఎక్కువగా ఉంది. కోజికోడ్‌లో 57, 679 మంది ప్రవాసులున్నారు. కన్నూర్‌లో 52, 163 మంది, మలప్పురంలో 39, 501 మంది ఉన్నారు. ఈ మూడు జిల్లాలలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు విదేశాల్లో ఉన్నారు. వీరంతా ఓటు వేసేందుకు రాగలిగితే ఎన్నికల ఫలితాలు ఒక వైపుగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే రాజకీయ పార్టీలు తమ కేడర్‌ను గల్ఫ్ దేశాల్లో ఉత్సాహపరుస్తూ వారిని స్వదేశానికి పంపేలా ప్రోత్సహిస్తున్నాయి.

అనుమతులే అనుమానం

చార్టర్డ్ విమానాలు నడపటం అంత సులభమైన విషయం కాదు. ఇప్పటికే విమానయాన సంస్థలు ఒక కండిషన్ పెట్టాయి. గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు పొందితేనే విమానాలు నడపడం సాధ్యమవుతుందని స్పష్టం చేశాయి. అంతేకాకుండా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా ఈ ప్రయాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ భారీ ఆపరేషన్ కేవలం ఓట్ల కోసం మాత్రమే కాదు, గల్ఫ్‌ మలయాళీలకు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఈ చార్టర్డ్ విమానాలు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెడతాయనేది ఇప్పుడు కేరళ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.

Latest