Mahaa Daily Exclusive

  దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డ్: జోన్ చరిత్రలోనే ఆల్ టైమ్ హై లోడింగ్.. 144 మిలియన్ టన్నుల మైలురాయి అధిగమనం!

Share

  • సరకు రవాణాలో రైల్వే కొత్త రికార్డ్
  • జోన్ చరిత్రలో అత్యధిక సరుకు రవాణా లోడింగ్‌ను నమోదు చేసిన దక్షిణ మధ్య రైల్వే
  • జోన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 144.244 మిలియన్ టన్నుల సరుకు రవాణా

హైదరాబాద్, మహా : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26లో దక్షిణ మధ్య రైల్వే 144.244 మిలియన్ టన్నుల (ఎమ్.టిలు) సరుకు రవాణాతో అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. ఈ అత్యుత్తమ పనితీరు 2024–25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ లోడింగ్ అయిన 144.14 మిలియన్ టన్నులను అధిగమించింది. దక్షిణ మధ్య రైల్వే ముఖ్యంగా తన పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాల నుండి బొగ్గు, సిమెంట్ రవాణా రంగంలో పటిష్టంగా ఉంది. దీనికితోడు జోన్ లోని ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, సరుకు రవాణా విభాగంలో కొత్త సరుకుల రవాణాను చేర్చడం ద్వారా నూతన ఒరవడులకు శ్రీకారంచుట్టారు. రవాణా వ్యవస్థలో ప్రధాన వస్తువైన బొగ్గు- 66.878 మిలియన్ టన్నులు. సిమెంట్ 37.572 మిలియన్ టన్నులు. ఇనుప ఖనిజం- 8.620 మిలియన్ టన్నులు. ఎరువులు 8.038 మిలియన్ టన్నులు. ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు 4.810 మిలియన్ టన్నులు. ఆహార ధాన్యాలు 6.225 మిలియన్ టన్నులు. కంటైనర్లు 2.561 మిలియన్ టన్నులు. పెట్రోలియం ఉత్పత్తులు 1.223 మిలియన్ టన్నులు. ఇతర వస్తువులు 8.349 మిలియన్ టన్నులు: మొత్తంగా 144.244 మిలియన్ టన్నులు.

దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది సమిష్టి కృషి, అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా రికార్డు స్థాయి పనితీరు సాధ్యమైంది. సరుకు రవాణా వినియోగదారులను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాల మెరుగుదల, టెర్మినల్స్‌లో పని వాతావరణం, గూడ్స్ షెడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అదనంగా, వినియోగదారుల అవసరాలను సమాయనుసారం పరిష్కరించేందుకు అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సాంప్రదాయ సరుకులతో పాటు ఇతర సరుకులను కూడా గుర్తించి, పోర్ట్ లోడింగ్‌పై దృష్టి సారించడంలో జోన్ చేసిన నిరంతర ప్రయత్నాలు రికార్డు స్థాయి సరుకు రవాణాను సాధించడానికి దోహదపడ్డాయి.

Latest