* నయారా బంకుల్లో ఇష్టారాజ్యంగా ధరల వసూలు.
* లీటర్ పెట్రోల్‌పై రూ. 5 అదనపు బాదుడు.
* సూర్యాపేట జిల్లాలో నిబంధనలకు తిలోదకాలిస్తున్న బంకుల నిర్వాహకులు.
* సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న నయారా పెట్రోల్ బంకులు..
* తక్షణమే తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్.
సూర్యాపేట,మహా.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మరియు దాని పరిసర ప్రాంతాల్లోని నయారా పెట్రోల్ బంకుల్లో ధరల వ్యత్యాసం ఇప్పుడు పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తూ సామాన్యులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు రోజుల క్రితం వరకు ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 107.00 ఉండగా, ప్రస్తుతం నయారా పెట్రోల్ బంకుల్లో ఏకంగా రూ. 112.28 వసూలు చేస్తుండటం గమనార్హం. అంటే లీటరుకు సుమారు రూ. 5.28 అదనంగా సామాన్యుడి నుంచి వసూలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 26, 2026 నాటికి సగటు పెట్రోల్ ధర రూ. 108.06 ఉండగా, ఇక్కడ మాత్రం ఇంత భారీ వ్యత్యాసం ఉండటంపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.
నిర్వాహకులు కావాలనే కృత్రిమ ధరలను సృష్టించి లాభపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర తక్కువగా ఉన్న సమయంలో ‘స్టాక్ లేదు’ అని చెప్పడం, ధర పెరగగానే అధిక మొత్తంలో వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ధరలను సవరించాలనే ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ, ఇక్కడ మాత్రం యజమానులు తమ ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంకుల యాజమాన్యాల తీరు వల్ల రోజువారీ ప్రయాణీకులు, కూలీలు మరియు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ అక్రమ వసూళ్లపై ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించాలని హుజూర్నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, హుజూర్నగర్ ప్రాంతంలోని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు.







