* అనంతపురం జిల్లాలో ఘోరం.
* అత్తామామలు గౌరవం ఇవ్వలేదని ఏడేళ్ల బావమరిదిని కడతేర్చిన బావ!
* మాయమాటలు చెప్పి తీసుకెళ్లి చిన్నారి హత్య..
అనంతపురం,మహా.
అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది. కేవలం మర్యాదలు దక్కలేదన్న చిన్న కారణంతో, కన్న కొడుకులా చూసుకోవాల్సిన ఏడేళ్ల బావమరిదిని బావ దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, పండుగ పూట ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. కోనుప్పలపాడుకు చెందిన వేమ్ చంద్ర అనే ఏడేళ్ల బాలుడు నిన్న పాఠశాలకు వెళ్ళాడు. సాయంత్రం పాఠశాల నుంచి వస్తుండగా, బాలుడికి బావ బోయ సర్వేశ్ ఎదురై మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా, బాలుడు హత్యకు గురైనట్లు నిర్ధారణ అయింది.
ఈ దారుణానికి ఒడిగట్టిన బోయ సర్వేశ్, మృతుడు వేమ్ చంద్ర అక్కను వివాహం చేసుకున్నాడు. ఉగాది పండుగ పురస్కరించుకుని భార్యతో కలిసి అత్తారింటికి వచ్చిన సర్వేశ్, అక్కడ తనకు సరైన గౌరవ మర్యాదలు దక్కడం లేదని భావించాడు. అత్తామామలు తనను సరిగ్గా ఆదరించడం లేదనే చిన్నపాటి అసంతృప్తితో వారిపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. తన కోపాన్ని అత్తామామలపై నేరుగా చూపలేక, నిరపరాధి అయిన చిన్నారి వేమ్ చంద్రను లక్ష్యంగా చేసుకున్నాడు. పక్కా పథకం ప్రకారం బాలుడిని స్కూల్ నుంచి వస్తుండగా అపహరించి, ఎవరూ లేని చోట ప్రాణాలు తీశాడు.
పోలీసుల విచారణలో నిందితుడు బోయ సర్వేశ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. చిన్నారి మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అల్లారుముద్దుగా పెరుగుతున్న కొడుకు, తన సొంత బావ చేతిలోనే హత్యకు గురవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు.







