Mahaa Daily Exclusive

  హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రంపై పోలీసుల పంజా……

Share

* హైదరాబాద్‌లో కల్తీ ఐస్‌క్రీమ్ కేంద్రంపై పోలీసుల పంజా.
* ముషీరాబాద్‌లో అడ్డంగా దొరికిపోయిన నిర్వాహకుడు!
* రూ. 1.75 లక్షల విలువైన నకిలీ ఐస్‌క్రీమ్ స్వాధీనం..
* అనుమతులు లేకుండానే అక్రమ దందా.
* భాగ్యనగరంలో ఐస్‌క్రీమ్ ప్రియులకు హెచ్చరిక.
* బాపూజీనగర్‌లో నాణ్యతలేని తయారీ కేంద్రం గుట్టురట్టు.
హైదరాబాద్, మహా.
భాగ్యనగరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో కల్తీ దందాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ముషీరాబాద్ పరిధిలోని బాపూజీనగర్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్న ఒక కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై హేపాస్ట్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాణ్యత లేని ముడి పదార్థాలతో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, తయారీదారుని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఐస్‌క్రీమ్‌లకు ఉండే డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఇలాంటి అక్రమ కేంద్రాలు వెలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం, ముషీరాబాద్ బాపూజీనగర్ ప్రాంతంలో అశోక్ అనే వ్యక్తి నివాస గృహంలోనే ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అతి తక్కువ ధరకే లభించే ప్రమాదకర రసాయనాలు, నాణ్యత లేని పాలు మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. దీనిపై స్పందించిన పోలీసులు తనిఖీలు చేపట్టగా, అక్కడ తయారవుతున్న ఉత్పత్తులు ఏమాత్రం వినియోగానికి యోగ్యమైనవి కావని తేలింది. సుమారు రూ. 1.75 లక్షల విలువైన కల్తీ ఐస్‌క్రీమ్ నిల్వలను పోలీసులు అక్కడికక్కడే సీజ్ చేశారు.
ముఖ్యంగా ఈ తయారీ కేంద్రానికి సంబంధించి ఎటువంటి చట్టపరమైన అనుమతులు లేవని దర్యాప్తులో వెల్లడైంది. జీహెచ్‌ఎంసీ , ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి కనీస లైసెన్సులు తీసుకోకుండానే, అపరిశుభ్ర వాతావరణంలో అశోక్ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు అశోక్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రజలు బయట లభించే ఐస్‌క్రీమ్‌లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా బ్రాండ్ లేని వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest