- ఇందిరమ్మ ఇళ్లకు ‘ఏఐ’ పహారా..
- అనర్హుల వేటలో సరికొత్త సాంకేతికత.
- కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి బోగస్ బాగోతం.
- వందలాది మందికి పొంచి ఉన్న ముప్పు.
- అర్హులకు అన్యాయం జరగకుండా సర్కార్ నిఘా.
- క్షేత్రస్థాయిలో ఏఐ డేటా ఆధారంగా జల్లెడ.
కామారెడ్డి ,మహా.
“పేదవాడి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమార్కుల ఆటలకు కళ్లెం పడుతోంది. పైరవీకారుల అండతోనో, అధికారుల కళ్లు గప్పో అర్హుల జాబితాలో చేరిన అనర్హులను ఏరిపారేసేందుకు ప్రభుత్వం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ సాంకేతికతను వజ్రాయుధంగా వాడుతోంది. జిల్లాలో ఇళ్లు లేని నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ, కొందరు అక్రమ మార్గాల్లో ఈ పథకాన్ని దక్కించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఏఐ సాంకేతికత సహాయంతో లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న యంత్రాంగం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిని ఇట్టే పసిగడుతోంది. దీనివల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా పక్కాగా పథకం అమలయ్యే అవకాశం కలుగుతోంది.”
కామారెడ్డి జిల్లాలో ఈ పథకం అమలు తీరును పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,021 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అయితే లబ్ధిదారుల జాబితాలో పెద్ద ఎత్తున బోగస్ పేర్లు ఉన్నట్లు ఏఐ సాంకేతికత ప్రాథమికంగా గుర్తించింది. ప్రారంభంలో జిల్లాలో దాదాపు 675 మంది అనర్హులు ఉన్నట్లు ఏఐ నివేదిక ఇవ్వగా, దీనిపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో సుమారు 428 మంది నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందుతున్నట్లు తేలింది. వీరిలో పలువురు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని, గ్రామ కమిటీల కళ్లు గప్పి పేర్లు నమోదు చేయించుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కారు వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నవారు, గతంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధి పొందినవారు కూడా ఈసారి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
క్షేత్రస్థాయిలో గ్రామ కమిటీలు మరియు అధికారులు కొన్ని చోట్ల చూసీచూడనట్లు వ్యవహరించడంతో అనర్హులు జాబితాలోకి చేరారు. అయితే బిల్లుల చెల్లింపు సమయంలో ప్రభుత్వం ఏఐ సాంకేతికతను జోడించడంతో అసలు రంగు బయటపడింది. లబ్ధిదారుల ఆధార్, పాన్ కార్డు మరియు ఇతర ఆస్తుల రికార్డులను ఏఐ విశ్లేషించి, వారికి సొంత ఇళ్లు లేదా వాహనాలు ఉన్నట్లు రికార్డుల ద్వారా పసిగట్టింది. జిల్లాలో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాల పురోగతిని చూస్తే.. 10,222 ఇళ్లకు ముగ్గుపోసి పనులు మొదలుపెట్టగా, 2868 ఇళ్లు బేస్‌మెంట్ స్థాయికి చేరుకున్నాయి. 1007 ఇళ్లు రూఫ్ స్థాయికి, 333 ఇళ్లు స్లాబ్ స్థాయికి రాగా, ఇప్పటికే 292 ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మాణం కావడం విశేషం. ఏ దశలోనైనా అక్రమాలు జరిగినట్లు ఏఐ గుర్తిస్తే వెంటనే నిధుల విడుదల నిలిపివేసి విచారణ జరుపుతున్నారు.
అయితే ఏఐ విశ్లేషణలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. దీనివల్ల బాధితులుగా మిగిలిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జీవనోపాధి కోసం కొనుగోలు చేసిన ఆటోలు లేదా ఇతర వాహనాలను కూడా ఏఐ ధనిక వర్గంగా పరిగణిస్తోంది. అలాగే పాత ఇళ్లను కూల్చివేసి కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న వారికి, రికార్డుల్లో పాత ఇల్లు ఇంకా ఉండటం వల్ల ఏఐ అనర్హులుగా చూపిస్తోంది. ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, అది వాస్తవమైన పేదరికం అని నిర్ధారిస్తే ఆ నివేదికను కలెక్టర్ ద్వారా రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నారు. ఆ తర్వాతే వారికి బిల్లుల చెల్లింపులకు మార్గం సుగమమవుతోంది. ఏదేమైనా, అక్రమార్కుల ఏరివేతలో ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తూ పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తోంది.







